పాండ్యాపై రవిశాస్త్రి ప్రశంసల జల్లు

11 Dec, 2020 20:29 IST|Sakshi

సిడ్నీ: వన్డే సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడం ద్వారా టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకున్న భారత్‌ ప్రస్తుతం టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. అయితే వన్డే, టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం జట్టుతో లేడన్న సంగతి తెలిసిందే. పొట్టి ఫార్మాట్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన పాండ్యాను సెలక్టర్లు టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ పాండ్యాను టెస్టు జట్టులో ఎంపిక చేసి ఉంటే బౌలింగ్‌ కూడా చేయాల్సి ఉంటుందని, బ్యాట్స్‌మన్‌గా  మాత్రమే  హార్దిక్‌ను టెస్టు జట్టులోకి పరిగణించలేమన్నాడు. పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా ఫిట్‌ కాలేకపోవడమే హార్దిక్‌ను టెస్టు జట్టులో ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణమని స్పష్టం చేశాడు.(చదవండి: నా దృష్టిలో అతడే గొప్ప.. కానీ నా ఓటు కోహ్లికే!)

ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా విజయాల్లో హార్దిక్‌ పాండ్యా, నటరాజన్‌ కీలక పాత్ర పోషించారన్న విషయం విదితమే. మూడో వన్డేలో చెలరేగి ఆడిన పాండ్యా.. 76 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్స్‌తో 92 పరుగులు సాధించాడు. తద్వారా తన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఇక వన్డే సిరీస్‌లో మొత్తంగా 210 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. టీ20లోనూ అదే జోరును కొనసాగించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌ అరంగేట్రంలో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు.

అదే విధంగా టీ20 సిరీస్‌లో మొత్తంగా ఆరు వికెట్లు(3,2,1) తీసి అద్భుత ప్రదర్శనతో అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. పాండ్యా సైతం తన దృష్టిలో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు అతడే అర్హుడంటూ అభిమానం చాటుకున్నాడు. వీళ్లిద్దరి ప్రదర్శనపై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ప్రశంసలు కురిపించాడు. ‘‘రోహిత్‌, బుమ్రా లేకుండా టీ20 సిరీస్‌ గెలవడమనేది అతి పెద్ద విజయంగా భావించాల్సి ఉంటుంది. జట్టు మొత్తం ఎంతో బాధ్యతగా ఆడింది. 

ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా సహజమైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతడి తర్వాతే ఎవరైనా. ఈ సిరీస్‌లో బంతిని అత్యంత అద్భుతంగా స్ట్రైక్‌ చేసింది అతడే’’ అని కొనియాడాడు. అదే విధంగా నటరాజన్‌ గురించి చెబుతూ.. ‘‘తనను నెట్‌ బౌలర్‌గా తీసుకున్నాం. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. అయితే అతడిపై నమ్మకం ఉంచిన టీం మేనేజ్‌మెంట్‌కే ఆ క్రెడిట్‌ దక్కుతుంది. తనలో విశ్వాసం నింపిన విధానం అమోఘం. తన సుదీర్ఘ ప్రయాణానికి ఇదో మంచి ఆరంభం’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.(చదవండి: నెట్‌ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్‌)

మరిన్ని వార్తలు