చెన్నపట్నం చిన్నోడు.. రవిచంద్రన్‌ అశ్విన్

16 Feb, 2021 04:48 IST|Sakshi

‘చెపాక్‌ మైదానంలో సెంచరీ చేయడం నా చిన్ననాటి కల’... కొన్నాళ్ల క్రితం రవిచంద్రన్‌ అశ్విన్‌ చెప్పిన మాట ఇది. 34 ఏళ్ల వయసులో కెరీర్‌ దాదాపు చివరి దశకు వచ్చిన తర్వాత అతను తన కోరికను నెరవేర్చుకున్నాడు. మళ్లీ చెన్నైలో అతను ఎప్పుడు టెస్టు ఆడగలడో తెలీదు కానీ సోమవారం మాత్రం అతను తన బ్యాటింగ్‌లో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాడు. అందుకే శతకం పూర్తయ్యాక తనకు అండగా నిలిచిన అభిమానులను ఎవరినీ మరచిపోలేదన్నట్లుగా ప్రేక్షకులు ఉన్న ప్రతీ ఒక్క గ్యాలరీ వైపు మళ్లీ మళ్లీ బ్యాట్‌ చూపిస్తూ ‘థ్యాంక్స్‌’ చెప్పాడు.

ఒక బౌలర్‌గా సొంత మైదానంలో అశ్విన్‌ ఖాతాలో చెప్పుకోదగ్గ గణాంకాలే ఉన్నాయి. తాజా సిరీస్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అశ్విన్‌ అంతకుముందే మరో రెండుసార్లు చెన్నైలో ఈ ఘనత సాధించాడు. అయితే ఈసారి తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను అతను చిరస్మరణీయం చేసుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా కెరీర్‌ మొదలు పెట్టి జూనియర్‌ స్థాయి వరకు అలాగే కొనసాగి ఆపై ఆఫ్‌స్పిన్నర్‌గా మారిన అశ్విన్‌లోని అసలైన బ్యాట్స్‌మన్‌ ఇక్కడ మళ్లీ కనిపించాడు. నిజానికి కెరీర్‌ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చినా ఆ తర్వాత అశ్విన్‌ బ్యాటింగ్‌ కళ మసకబారింది. 2017 ఆగస్టు తర్వాత అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే ఇటీవల సిడ్నీలో మ్యాచ్‌ను కాపాడిన ఇన్నింగ్స్‌ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు.

ఈ సిరీస్‌లో కూడా జడేజా లేకపోవడంతో బ్యాటింగ్‌పరంగా కూడా అశ్విన్‌పై బాధ్యత పెరిగింది. అయితే గతంలో అతను సాధించిన నాలుగు టెస్టు సెంచరీలతో (అన్నీ వెస్టిండీస్‌పైనే) పోలిస్తే సోమవారం పరిస్థితులు భిన్నం. అశ్విన్‌ క్రీజ్‌లో వచ్చే సమయానికి భారత్‌ మంచి ఆధిక్యంలో ఉన్నా సరే... పిచ్‌ అంత అనుకూలంగా లేదు. పరుగులు సునాయాసంగా వచ్చేలా కనిపించడం లేదు. ఒకే సెషన్‌లో జట్టు ఐదు వికెట్లు కోల్పోయిందంటే ఇకపై ఎలా ఆడాలన్న ఒక సందిగ్ధతతో బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ దశలో అతను అతను తన ఇన్నేళ్ల అనుభవాన్ని చూపించాడు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన ఈ మదరాసీ తొలి ఐదు బంతుల్లోనే రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అతని ఇన్నింగ్స్‌లో స్వీప్‌ షాట్‌లు హైలైట్‌గా నిలిచాయి.  చదవండి: (వహ్వా.. చెపాక్‌ తలైవా!)

మొదటి నాలుగు బౌండరీలను స్వీప్‌ ద్వారానే రాబట్టిన అశ్విన్‌ పదే పదే ఆ షాట్‌తో ఫలితం సాధించాడు. ‘ఎప్పుడో అండర్‌–19 స్థాయిలో స్వీప్‌ షాట్లు ఆడాను. వాటి కారణంగా తుది జట్టులో చోటు పోవడంతో వదిలేశాను. గత 13–14 ఏళ్లుగా స్వీప్‌ షాట్‌ ఆడనే లేదు. ఇప్పుడు మాత్రం పిచ్‌ను దృష్టిలో పెట్టుకొని తీవ్రంగా సాధన చేశాను’ అని అతను స్వయంగా చెప్పాడు. 64 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. సాహసవంతులకే అదృష్టం కూడా కలిసొస్తుందన్నట్లుగా రెండుసార్లు అశ్విన్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్రాడ్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ క్యాచ్‌ వదిలేసినప్పుడు అశ్విన్‌ స్కోరు 29 పరుగులు కాగా, 56 పరుగుల వద్ద బ్రాడ్‌ బౌలింగ్‌లోనే కీపర్‌ ఫోక్స్‌ క్యాచ్‌ అందుకోలేకపోయాడు.

అయితే మరో ఎండ్‌లో కోహ్లి, కుల్దీప్, ఇషాంత్‌ తక్కువ వ్యవధిలో అవుట్‌ కావడంతో అశ్విన్‌ సెంచరీ సాధించడం దాదాపు అసాధ్యంగా అనిపించింది. చివరి బ్యాట్స్‌మన్‌ సిరాజ్‌ క్రీజ్‌లోకి వచ్చే సమయానికి అశ్విన్‌ స్కోరు 77 పరుగులు! ఈ దశలో సిరాజ్‌ పట్టుదలగా నిలబడి అశ్విన్‌కు సహకరించాడు. పదో వికెట్‌కు వీరిద్దరి మధ్య 49 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. లీచ్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో 90ల్లోకి వచ్చిన అశ్విన్‌... అలీ ఓవర్లో మిడ్‌ వికెట్‌ మీదుగా స్లాగ్‌ స్వీప్‌లో సిక్సర్‌ బాది 97 వద్ద నిలిచాడు. అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా, బంతి స్లిప్స్‌ మీదుగా బౌండరీని చేరింది. అంతే... తన ఆనందాన్ని ప్రదర్శిస్తూ మైదానంలో అశ్విన్‌ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో సిరాజ్‌ కూడా తానే సెంచరీ చేసినంతగా సందడి చేయడం విశేషం. తాను ఓనమాలు నేర్చిన చోట బ్యాట్‌తోనూ అశ్విన్‌ సాధించిన ఈ ఘనత ఎప్పటికీ అతనికి ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

చదవండి:
వైరల్‌: అశ్విన్‌ సెంచరీ.. సిరాజ్‌ స్పందన

కాస్తైనా కనికరం లేదా అశ్విన్..!

మరిన్ని వార్తలు