జూనియర్ల జోరు

19 Aug, 2021 05:11 IST|Sakshi
రవీందర్‌ ,కాంస్యం గెలిచిన భారత బృందం

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

రవీందర్‌కు రజత పతకం

భారత్‌ ఖాతాలో మరో 3 కాంస్యాలు

వుఫా (రష్యా): జూనియర్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ రవీందర్‌ ‘బంగారు’ ఆశలు ఫైనల్లో ఆవిరయ్యాయి. 61 కేజీల విభాగంలో అతను రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇరాన్‌ రెజ్లర్‌ రహ్మాన్‌ ముసా అమోజద్కలి 9–3తో రవీందర్‌ను ఓడించాడు. రెపిచేజ్‌ దారిలో ఉన్న రజతం అవకాశాల్ని యశ్‌ (74 కేజీలు), పృథ్వీ పాటిల్‌ (92 కేజీలు), అనిరుధ్‌ (125 కేజీలు) సద్వినియోగం చేసుకున్నారు.

దీంతో భారత్‌ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు చేరాయి. రజతం సహా మొత్తం 6 పతకాలు ఫ్రీస్టయిల్‌ రెజ్లర్లు గెలిచారు. 74 కేజీల కాంస్య పతక పోరులో యశ్‌ 12–6తో కిర్గిజిస్తాన్‌కు చెందిన స్టాంబుల్‌ జానిబెక్‌పై గెలుపొందగా, పృథ్వీ పాటిల్‌ (92 కేజీలు) 2–1తో ఇవాన్‌ కిరిలోవ్‌ (రష్యా)ను కంగుతినిపించాడు. అనిరుధ్‌ (125 కేజీలు) 7–2తో అయిదిన్‌ అహ్మదోవ్‌ (అజర్‌బైజాన్‌)ను ఓడించాడు.  

ఫైనల్లో బిపాషా: మహిళల ఈవెంట్‌లో బిపాషా (76 కేజీలు) స్వర్ణ బరిలో నిలిచింది. ఆమె ఫైనల్‌ చేరడంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో బిపాషా 9–4తో మంగోలియాకు చెందిన ఒద్‌బాగ్‌ ఉల్జిబాత్‌పై అలవోక విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆమె 6–3తో కజకిస్తాన్‌ రెజ్లర్‌ దిల్నాజ్‌ ముల్కినోవాను ఓడించింది. 50 కేజీల విభాగంలో సిమ్రాన్‌ ఉడుం పట్టు సెమీస్‌లో సడలింది. ఎమిలీ కింగ్‌ షిల్సన్‌ (అమెరికా)తో జరిగిన పోరులో ఆమె ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’లో పరాజయం చవిచూసింది. మిగతా రెజ్లర్లు సితో (55 కేజీలు), కుసుమ్‌ (59 కేజీలు), అర్జూ (68 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు.

ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌
► 4 X 400 మీ. మిక్స్‌డ్‌ రిలేలో భారత్‌కు కాంస్యం  
► జావెలిన్‌లో ఇద్దరు ఫైనల్‌కు

నైరోబీ: వరల్డ్‌ జూనియర్‌ (అండర్‌–20) అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ తొలి రోజు భారత్‌ సత్తా చాటింది. 4 X 400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మన బృందం 3 నిమిషాల 20.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. కాంస్యం గెలిచిన భారత జట్టులో శ్రీధర్‌ భరత్, ప్రియా మోహన్, సుమ్మీ, కపిల్‌ సభ్యులుగా ఉన్నారు. శ్రీధర్‌ ముందుగా పరుగు మొదలు పెట్టగా...ప్రియా, సుమ్మీ తర్వాతి లెగ్‌లలో పరుగెత్తారు.

చివర్లో బ్యాటన్‌ అందుకున్న కపిల్‌...తనకు పోటీగా దూసుకొచ్చిన జమైకా అథ్లెట్‌ను వెనక్కి నెట్టి భారత్‌ను గెలిపించాడు. ఈ ఈవెంట్‌లో నైజీరియా (3 నిమిషాల 19.70 సెకన్లు), పోలండ్‌ (3 నిమిషాల 19.80 సెకన్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నాయి. అంతకు ముందు హీట్స్‌లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ పరుగులో పాల్గొన్న అబ్దుల్‌ రజాక్‌ స్థానంలో ఫైనల్లో శ్రీధర్‌ బరిలోకి దిగాడు. వరల్డ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో గతంలో భారత్‌ తరఫున సీమా అంటిల్‌ (కాంస్యం – డిస్కస్, 2002), నవజీత్‌ కౌర్‌ (కాంస్యం – డిస్కస్‌ 2014), నీరజ్‌ చోప్రా (స్వర్ణం – జావెలిన్, 2016), హిమ దాస్‌ (స్వర్ణం – 400 మీ., 2018) పతకాలు గెలుచుకున్నారు.  

షాట్‌పుట్‌లో ఫైనల్‌కు: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ మరో మూడు ఈవెంట్లలో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. షాట్‌పుట్‌లో అమన్‌దీప్‌ సింగ్‌ గుండును 17.92 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రియా మోహన్‌ 400 మీటర్ల పరుగులో కూడా ఫైనల్‌కు చేరుకుంది. జావెలిన్‌ త్రోలో ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టడం విశేషం. అజయ్‌ సింగ్‌ రాణా (71.05 మీటర్లు), జై కుమార్‌ (70.34 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో సత్తా చాటి ఫైనల్‌ చేరారు.

మరిన్ని వార్తలు