SA20 2023 JOH Vs DUR: ఆర్‌సీబీ కెప్టెన్‌ విధ్వంసం.. టోర్నీలో తొలి సెంచరీ నమోదు

25 Jan, 2023 13:50 IST|Sakshi

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ సౌతాఫ్రికా 20 లీగ్‌(SA20 2023) టోర్నీలో తొలి శతకంతో మెరిశాడు. లీగ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డుప్లెసిస్‌ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. (58 బంతుల్లోనే 113 పరుగులు నాటౌట్‌) చేసిన డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. ముందు కెప్టెన్‌గా తన బాధ్యతను నిర్వహించిన డుప్లెసిస్‌ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు.కాగా తొలిసారి జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్‌ 2023లో డుప్లెసిస్‌దే తొలి శతకం కావడం విశేషం. ఇక డుప్లెసిస్‌ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు కలిపి 277 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో జాస్‌ బట్లర్‌ 285 పరుగులు(పార్ల్‌ రాయల్స్‌ జట్టు) ఉన్నాడు.

మంగళవారం వాండరర్స్‌ వేదికగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌(48 బంతుల్లో 65 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హోల్డర్‌ 28, కైల్‌ మేయర్స్‌ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ డుప్లెసిస్‌ ధాటికి 19.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ 45 పరుగులతో రాణించాడు.

ఇక గతేడాది ఐపీఎల్‌లో డుప్లెసిస్‌ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని సారధ్యంలో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు షాకిచ్చిన ఆర్‌సీబీ క్వాలిఫయర్‌-2లో మాత్రం రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఖంగుతింది. అలా గతేడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

చదవండి: SA20 2023: చెలరేగిన బట్లర్‌, మిల్లర్‌.. సన్‌రైజర్స్‌కు భంగపాటు

'22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు'

మరిన్ని వార్తలు