Ruturaj Gaikwad: బ్యాటింగ్‌ సంచలనం రుతురాజ్‌కు బంపర్ ఆఫర్‌.. ఏకంగా

26 Oct, 2021 13:59 IST|Sakshi
PC: IPL

Ruturaj Gaikwad: చెన్నై సూపర్‌కింగ్స్‌ స్టార్‌ ఓపెనర్‌, బ్యాటింగ్‌ యువ సంచలనం రుతురాజ్‌ గైక్వాడ్‌కు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఐపీఎల్‌-2021 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న అతడికి మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ నేపథ్యంలో 24 ఏళ్ల రుతురాజ్‌ను మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. కాగా ఈ దేశవాళీ టీ20 లీగ్‌ నవంబరు 4 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఎలైట్‌ గ్రూపు-ఏలో ఉన్న మహారాష్ట్ర లీగ్‌ స్టేజ్‌లో లక్నోలో మ్యాచ్‌లు ఆడనుంది. తమిళనాడు జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో రుతురాజ్‌ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇక నౌషద్‌ షేక్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. ఐపీఎల్‌-2021 ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు.

ఈ విషయాల గురించి మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రియాజ్‌ బాగ్బన్‌ మాట్లాడుతూ... ‘‘రాహుల్‌ త్రిపాఠి, సిద్దేశ్‌ వీర్‌, రాజ్‌వర్ధన్‌ స్థానాలను స్వప్నిల్‌ గుగాలే, పవన్‌ షా, జగదీశ్‌ జోపేతో భర్తీ చేశాం. వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన త్రిపాఠి గాయం నుంచి కోలుకోకపోవడంతో నౌషద్‌ షేక్‌ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాడు’’ అని పేర్కొన్నారు. ఇక రుతురాజ్‌ విషయానికొస్తే... చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగో సారి ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలవడంలో రుతురాజ్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌-2021 సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్‌ ఆడిన ఈ ఓపెనర్‌.. మొత్తంగా 635 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 4 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు.. 101 నాటౌట్‌. ఇక అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న విషయం తెలిసిందే.

మహారాష్ట్ర జట్టు:
రుతురాజ్‌ గైక్వాడ్‌(కెప్టెన్‌), నౌషద్‌ షేక్‌(వైస్‌ కెప్టెన్‌), కేదార్‌ జాదవ్‌, యశ్‌ నహర్‌, అజీమ్‌ కాజీ, రంజీత్‌ నికామ్‌, సత్యజీత్‌ బచ్చవ్‌, తరంజిత్‌సింగ్‌ ధిల్లాన్‌, ముకేశ్‌ చౌదరి, ఆశయ్‌ పాల్కర్‌, మనోజ్‌ ఇంగ్లే, ప్రదీప్‌ దాఢే, షంషుజమా కాజీ, స్వప్నిల్‌ ఫల్పాగర్‌, దివ్యాంగ్‌, సునీల్‌ యాదవ్‌, ధనరాజ్‌సింగ్‌ పరదేశి, స్వప్నిల్‌ గుగాలే, పవన్‌ షా, జగదీష్‌ జోపే.

చదవండి: T20 World Cup Pak Vs NZ: 24 టీ20లలో తలపడిన పాక్‌- కివీస్‌.. ఎవరిది పైచేయి అంటే!

మరిన్ని వార్తలు