French Open 2021: సెరెనా సాఫీగా...

5 Jun, 2021 03:09 IST|Sakshi

ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అమెరికా స్టార్‌

మూడో సీడ్‌ సబలెంకాకు షాక్‌

నాదల్‌ ముందంజ

పారిస్‌: రెండో రౌండ్‌లో శ్రమించి విజయాన్ని దక్కించుకున్న అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మూడో రౌండ్‌లో మాత్రం తడబడకుండా ఆడింది. తన దేశానికే చెందిన డానియెలా కొలిన్స్‌తో జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో 6–4, 6–4తో గెలిచిన ఏడో సీడ్‌ సెరెనా ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఐదు ఏస్‌లు సంధించింది. నెట్‌ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 8సార్లు పాయింట్లు సంపాదించిన సెరెనా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది.  

పావ్లీచెంకోవా సంచలనం
మరోవైపు టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరైన మూడో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) మూడో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 31వ సీడ్‌ పావ్లీచెంకోవా (రష్యా) అద్భుత ఆటతీరుతో 6–4, 2–6, 6–0తో సబలెంకాను బోల్తా కొట్టించి 2011 తర్వాత ఈ టోర్నీ లో మళ్లీ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 15వ సీడ్‌ అజరెంకా (బెలారస్‌) 6–2, 6–2తో 23వ సీడ్‌ కీస్‌ (అమెరికా)పై, 20వ సీడ్‌ మర్కెత వొంద్రుసొవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 6–3తో పొలోనా హెర్కాగ్‌ (స్లొవేనియా)పై, 21వ సీడ్‌ రిబికినా (కజకిస్తాన్‌) 6–1, 6–4తో వెస్నినా (రష్యా)పై, తామర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా) 0–6, 7–6 (7/5), 6–2తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు.

1968 తర్వాత తొలిసారి...

పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. రిచర్డ్‌ గాస్కే (ఫ్రాన్స్‌)తో జరిగిన మ్యాచ్‌లో నాదల్‌ 6–0, 7–5, 6–2తో గెలుపొందాడు. గాస్కే పరాజయంతో 1968 తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగంలో ఒక్క ఫ్రాన్స్‌ క్రీడాకారుడు కూడా మూడో రౌండ్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. ఈసారి సింగిల్స్‌ విభాగంలో ఫ్రాన్స్‌ నుంచి 29 మంది బరిలోకి దిగారు.

మరోవైపు మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–2, 7–5, 6–2తో లాస్లో జెరె (సెర్బియా)పై, రెండో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) 6–4, 6–2, 6–4తో ఒపెల్కా (అమెరికా)పై, 12వ సీడ్‌ కరెనో బుస్టా (స్పెయిన్‌) 6–4, 6–4, 6–2తో జాన్సన్‌ (అమెరికా)పై ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. 15వ సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌ (నార్వే) 4 గంటల 35 నిమిషాల్లో 6–7 (3/7), 6–2, 6–7 (6/8), 6–0, 5–7తో ఫోకినా (స్పెయిన్‌) చేతిలో... 27వ సీడ్‌ ఫాగ్‌నిని (ఇటలీ) 4–6, 1–6, 3–6తో డెల్‌బోనిస్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు