లార్డ్‌ శార్దూల్‌ ఠాకూర్‌.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇలా..?

19 Jan, 2023 16:05 IST|Sakshi

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాభవం గేట్ల వరకు వెళ్లి తిరిగి వచ్చింది. భారీ ఛేదనలో విధ్వంసకర శతకంతో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఖరి ఓవర్‌లో ఔట్‌ కాకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది.  టీమిండియా బౌలర్లను అందరూ ఆడిపోసుకునే వారు. 349 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయారని దుమ్మెత్తి పోసేవారు.

ముఖ్యంగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న శార్దూల్‌ ఠాకూర్‌, హార్ధిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌లను అందరూ టార్గెట్‌ చేసేవారు. వీరిలో మరి ముఖ్యంగా లార్డ్‌ శార్దూల్‌ భారత అభిమానుల ఆగ్రహావేశాలకు గురయ్యేవాడు. కీలక దశలో వరుస వైడ్‌ బాల్స్‌ (39వ ఓవర్‌లో 4 వైడ్లు, 3 ఫోర్లు) వేయడంతో పాటు బేసిక్స్‌ మరిచి బౌలింగ్‌ చేసినందుకు గానూ శార్దూల్‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకునేవారు. అయితే ఆఖరి ఓవర్‌లో విరాట్‌ కోహ్లి సలహా మేరకు, చాకచక్యంగా యార్కర్‌ బాల్‌ వేయడంతో బ్రేస్‌వెల్‌ ఔటయ్యాడు. అప్పుడు శార్దూల్‌ సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఒకవేళ బ్రేస్‌వెల్‌ ఔట్‌ కాకుండా.. న్యూజిలాండ్‌ మ్యాచ్‌ గెలిచి ఉండి ఉంటే, లార్డ్‌ శార్దూల్‌కు సీన్‌ సితార అయ్యేది. భారత్‌ మ్యాచ్‌ గెలిచినా ఫ్యాన్స్‌ మాత్రం శార్దూల్‌పై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. అసలు ఇతన్ని ఆల్‌రౌండర్‌గా ఎలా పరిగణిస్తారు.. అటు బ్యాటింగ్‌కు న్యాయం చేయడం లేదు, ఇటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు.. ఇతనికి ఎందుకు వరుస అవకాశాలు ఇస్తున్నారని సెలక్టర్లను నిలదీస్తున్నారు.

మరికొందరు ఫ్యాన్స్‌ ఏమో.. లార్డ్‌ శార్దూల్‌.. ఇలా అయితే ఎలా అమ్మా.. నిన్ను నీవు నిరూపించుకోవడానికి ఇంకెన్ని మ్యాచ్‌లు కావాలమ్మా.. జట్టులో చోటు కోసం చాలా మంది వెయిటింగ్‌ అక్కడ అంటూ సోషల్‌మీడియా వేదికగా సున్నితంగా చురకలంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో శార్దూల్‌.. 7.2 ఓవర్లు వేసి 54 పరుగులిచ్చాడు. అయితే కీలకమైన ఫిన్‌ అలెన్‌ (40), బ్రేస్‌వెల్‌ వికెట్లు పడగొట్టాడు.

కాగా, ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో జట్టులో చోటు సంపాదిస్తున్న లార్డ్‌ శార్దూల్‌.. కెరీర్‌ ఆరంభం నుంచే తన ప్రాతకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడపాదడపా రాణించినప్పటికీ.. అవి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ కాదు. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తో పాటు బంతిలోనూ రాణించాలని మేనేజ్‌మెంట్‌ అతని నుంచి ఆశిస్తుంది. శార్దూల్‌ దగ్గర ఆ సామర్థ్యం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడనే టాక్‌ నడుస్తుంది.

మరో వైపు హార్ధిక్‌ మినహా టీమిండియాకు మరో ప్రత్యామ్నాయ ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లేకపోవడంతో శార్దూల్‌ పప్పులు ఉడుకుతున్నాయి. వెంకటేశ్‌ అయ్యర్‌, విజయ్‌ శం‍కర్‌, శివమ్‌ దూబేలకు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. టీమిండియా ఫ్యాన్స్‌ అయితే అండర్‌19 జట్టు యువ ఆల్‌రౌండర్‌ రాజ్‌ అంగడ్‌ బవా, శివమ్‌ మావీలకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో టీమిండియా ఏమైనా ప్రయోగాలు చేస్తుందేమో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు