#ShabadKhan: మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2023.. సిక్సర్లతో విరుచుకుపడిన పాక్‌ ఆల్‌రౌండర్

15 Jul, 2023 13:20 IST|Sakshi

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌(MLC 2023) అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తున్నాయి. పీఎస్‌ఎల్‌(పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌) తర్వాత పాక్‌ జట్టుకు చెందిన చాలా మంది ఆటగాళ్లు మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇమాద్‌ వసీమ్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకోగా.. తాజాగా పాక్‌ ఆల్‌రౌండర్‌ షాబాద్‌ ఖాన్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

లీగ్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై న్యూయార్క్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో శాన్‌ ఫ్రాన్సిస్కో జట్టు 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శాన్‌ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోరే అండర్సన్‌(52 బంతుల్లో 91 పరుగులు నాటౌట్‌, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడగా.. ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌(30 బంతుల్లో 61 పరుగులు, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో షాదాబ్‌ ఖాన్‌ 20 బంతుల్లో 31 పరుగులతో ఆడుతున్నాడు. సరబ్‌జిత్‌ లడ్డా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. తొలుత స్ట్రెయిట్‌ సిక్సర్‌ సంధించిన షాదాబ్‌.. ఆ తర్వాత డీప్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా బౌండరీ తరలించాడు. అనంతరం రెండు వరుస బంతులను సిక్సర్లను సంధించాడు. షాదాబ్‌ఖాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్‌ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. టిమ్‌ డేవిడ్‌ 53 నాటౌట్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ 32, నికోలస్‌ పూరన్‌ 40, కీరన్‌ పొలార్డ్‌ 48 పరుగులు చేశారు. అయితే చివర్లో ఒత్తిడికి లోనైన ముంంబై న్యూయార్క్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగుల వద్ద ఆగిపోయింది. శాన్‌ఫ్రాన్సిస్కో బౌలర్లలో కార్మీ లి రౌక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

చదవండి: సింగిల్‌ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్‌ సీరియస్‌!

మరిన్ని వార్తలు