బీసీసీఐ రాజ్యాంగంలో మార్పుకు సుప్రీం అంగీకారం.. మరో విడత పదవుల్లో కొనసాగనున్న గంగూలీ, జై షా

14 Sep, 2022 18:30 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగంలో మార్పుల ప్రతిపాదనకు దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం (సెప్టెంబర్‌ 14) ఆమోదం తెలిపింది. తప్పనిసరి కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ మార్పు (పదవుల మధ్య విరామం నిబంధన), ఆఫీస్‌ బేరర్ల పదవీకాలానికి సంబంధించి రాజ్యాంగంలో మార్పులకు అనుమతివ్వాలని బీసీసీఐ కార్యవర్గం దాఖలు చేసిన పిటషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఈ కీలక తీర్పు వల్ల బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్‌ గంగూలీ, జై షాలు మరో విడత తమతమ పదవుల్లో కొనసాగనున్నారు. గంగూలీ, జై షాల పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

బీసీసీఐ రాజ్యాంగంలో ప్రస్తుతం అమల్లో ఉన్న లోధా కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర అసోసియేషన్‌, బీసీసీఐలో పదవుల్లో ఉన్న వారు వెంటనే పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన ఉంది. దీన్ని సవరించాలనే బీసీసీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.  ఆఫీస్‌ బేరర్లు వరుసగా 12 ఏళ్ల పాటు (స్టేట్ అసోసియేషన్‌లో ఆరేళ్లు, బీసీసీఐలో ఆరేళ్లు) పదవుల్లో కొనసాగవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు