పరుగు  పరుగున ప్లే ఆఫ్స్‌కు...

4 Nov, 2020 04:00 IST|Sakshi
వార్నర్‌, సాహా, నదీమ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందంజ

మెరిసిన వార్నర్, సాహా ముంబై ఇండియన్స్‌పై 

10 వికెట్లతో జయభేరి పాయింట్ల పట్టికలో 

మూడో స్థానం వరుసగా ఐదో ఏడాది టాప్‌–4లో 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధించి చూపించింది. 10 రోజుల క్రితం 127 పరుగులు కూడా ఛేదించలేక చేతులెత్తేసి ముందంజ వేసే అవకాశాలు చేజార్చుకున్నట్లు కనిపించిన ఆ జట్టు... ఇప్పుడు మరొక జట్టు సహకారం లేకుండా... రన్‌రేట్‌ లెక్కల అవసరం రాకుండా... తమ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో వరుసగా మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ముందంజ వేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బృందం అన్ని రంగాల్లో చెలరేగింది. టాప్‌లో దూసుకుపోయిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిలువరించిన హైదరాబాద్‌... ఆ తర్వాత వార్నర్, సాహాల మెరుపు బ్యాటింగ్‌తో 17 బంతులు మిగిలి ఉండగానే అలవోక విజయాన్ని అందుకుంది. ముంబై గెలుపుపై ఆశలు పెంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌... చివరి లీగ్‌ మ్యాచ్‌లో రైజర్స్‌ అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. 2016 నుంచి ప్రతీ ఏటా హైదరాబాద్‌ టాప్‌–4లో నిలవడం విశేషం.

షార్జా: మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌–2020లో లీగ్‌ దశను విజయవంతంగా అధిగమించింది. ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టుగా నిలిచే ప్రయత్నంలో చెలరేగిన జట్టు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పొలార్డ్‌ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... సూర్యకుమార్‌ యాదవ్‌ (29 బంతుల్లో 36; 5 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (30 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. సందీప్‌ శర్మకు 3 వికెట్లు దక్కగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాబాజ్‌ నదీమ్‌ (2/19) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అనంతరం హైదరాబాద్‌ 17.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (58 బంతుల్లో 85 నాటౌట్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చి జట్టును గెలిపించారు. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో బెంగళూరుతో సన్‌రైజర్స్‌ తలపడుతుంది.

పొలార్డ్‌ మెరుపులు... 
ఛేదనలో కాకుండా తొలుత బ్యాటింగ్‌ చేస్తూ ముంబై ఈ సీజన్‌లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. విరామం తర్వాత బరిలోకి దిగిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (4) ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు డికాక్‌ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొంత జోరు కనబర్చాడు. అయితే సందీప్‌ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన డికాక్, తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన సూర్యకుమార్‌ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. సూర్యతో పాటు కృనాల్‌ పాండ్యా (0)ను ఒకే ఓవర్లో నదీమ్‌ అవుట్‌ చేయగా, రషీద్‌ బౌలింగ్‌లో సౌరభ్‌ తివారి (1) వెనుదిరిగాడు. అనంతరం దూకుడుగా ఆడబోయిన ఇషాన్‌ను సందీప్‌ వెనక్కి పంపించాడు. ఈ దశలో పొలార్డ్‌ బ్యాటింగ్‌ ముంబైని మెరుగైన స్థితికి చేర్చింది. రషీద్‌ బౌలింగ్‌లో ఆరు పరుగుల వద్ద ఎల్బీ అయినట్లు రివ్యూలో స్పష్టంగా కనిపిస్తున్నా... ‘అంపైర్స్‌ కాల్‌’తో బతికిపోయిన అతను చెలరేగిపోయాడు. నటరాజన్‌ ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన అతను, అదే బౌలర్‌ తర్వాతి ఓవర్లో 6, 6, 6 బాదాడు. ఈ క్రమంలో మరో రెండు సార్లు రివ్యూలు పొలార్డ్‌కు అనుకూలంగా రావడం విశేషం. చివరి ఓవర్లో మరో సిక్స్‌ తర్వాత హోల్డర్‌ అతడిని బౌల్డ్‌ చేశాడు.

అలవోకగా... 
లక్ష్య ఛేదనలో వార్నర్, సాహా ఆడుతూ పాడుతూ బ్యాటింగ్‌ చేశారు. బుమ్రా, బౌల్ట్‌ లేని ముంబై బౌలింగ్‌ బలగం వీరిద్దరిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. అలవోకగా, చూడచక్కటి షాట్లతో రైజర్స్‌ ఓపెనర్లు చెలరేగారు. కూల్టర్‌నైల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సాహా, ధావల్‌ వేసిన మరుసటి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత వార్నర్‌ తన వంతుగా ప్యాటిన్సన్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ జోరు తగ్గించలేదు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో ముందుగా వార్నర్‌ (35 బంతుల్లో), ఆ తర్వాత సాహా (34 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా, అదే ఓవర్లో భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఆ తర్వాత లక్ష్యంవైపు హైదరాబాద్‌ మరింత వేగంగా దూసుకెళ్లింది. ముంబై బౌలర్లు పేలవ ప్రదర్శనతో ఒక్క వికెట్‌ తీయలేకపోయారు.

6- వార్నర్‌ తాను ఆడిన ఆరు వరుస ఐపీఎల్‌లలో (2014నుంచి) కనీసం 500కు పైగా పరుగులు సాధించాడు. కోహ్లిని (5 సార్లు) అతను అధిగమించాడు. 2018లో వార్నర్‌ ఐపీఎల్‌ ఆడలేదు.  
2- ఐపీఎల్‌ చరిత్రలో హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో నెగ్గడం ఇది రెండోసారి. 2016లో గుజరాత్‌ లయన్స్‌పై తొలిసారి ఈ ఘనత సాధించిన హైదరాబాద్‌ ఆ ఏడాది ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలువడం విశేషం. 

► 3- చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడటంద్వారా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దెబ్బతీయడం ముంబై ఇండియన్స్‌కిది (2010, 2019, 2020) మూడోసారి కావడం గమనార్హం.

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 4; డికాక్‌ (బి) సందీప్‌ 25; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) సాహా (బి) నదీమ్‌ 36; ఇషాన్‌ కిషన్‌ (బి) సందీప్‌ 33; కృనాల్‌ (సి) విలియమ్సన్‌ (బి) నదీమ్‌ 0; సౌరభ్‌ తివారి (సి) సాహా (బి) రషీద్‌ 1; పొలార్డ్‌ (బి) హోల్డర్‌ 41; కూల్టర్‌నైల్‌ (సి) గార్గ్‌ (బి) హోల్డర్‌ 1; ప్యాటిన్సన్‌ (నాటౌట్‌) 4; ధావల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.

వికెట్ల పతనం: 1–12; 2–39; 3–81; 4–81; 5–82; 6–115; 7–116; 8–145. బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–34–3; హోల్డర్‌ 4–0–25–2; నదీమ్‌ 4–0–19–2; నటరాజన్‌ 4–0–38–0; రషీద్‌ 4–0–32–1.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (నాటౌట్‌) 85; సాహా (నాటౌట్‌) 58; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 151. బౌలింగ్‌: ధావల్‌ కులకర్ణి 3–0–22–0; కూల్టర్‌నైల్‌ 4–0–27–0; ప్యాటిన్సన్‌ 3–0–29–0; రాహుల్‌ చహర్‌ 4–0–36–0; కృనాల్‌ 3.1–0–37–0.

మరిన్ని వార్తలు