2011 తర్వాత శ్రీలంక ఓపెనర్ల తొలి ద్విశతక భాగస్వామ్యం

30 Apr, 2021 10:19 IST|Sakshi

పల్లెకెలె: బంగ్లాదేశ్‌తో ఆరంభమైన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన శ్రీలంకను ఓపెనర్లు దిముత్‌ కరుణత్నే (190 బంతుల్లో 118, 15 ఫోర్లు), లహిరు తిరిమన్నె (253 బంతుల్లో 131 బ్యాటింగ్‌; 14 ఫోర్లు) సెంచరీలతో ముందుకు నడిపించారు. దాంతో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 291 పరుగులు చేసింది. కరుణరత్నే, తిరిమన్నె తొలి వికెట్‌కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2011 తర్వాత శ్రీలంక ఓపెనర్లు నెలకొల్పిన తొలి డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం ఇదే.

కాగా... స్వదేశంలో 21 ఏళ్ల తర్వాత ఈ ఘనతను సాధించడం విశేషం. కరుణరత్నే 165 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో అతడికిది 12వ శతకం. అంతేకాకుండా టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా అతను అందుకున్నాడు. మరో ఓపెనర్‌ తిరిమన్నె 212 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆటలో 90 ఓవర్ల పాటు చెమటోడ్చిన బంగ్లాదేశ్‌ బౌలర్లు కేవలం కరుణరత్నే వికెట్‌తోనే సంతృప్తి పడ్డారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఒషాడా ఫెర్నాండో (98 బంతుల్లో 40 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) కూడా కుదురుగా ఆడాడు. ఫెర్నాండోతో కలిసి తిరిమన్నె అభేద్యమైన రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించాడు. 

చదవండి: కరుణరత్నే అజేయ డబుల్‌ సెంచరీ

మరిన్ని వార్తలు