వారి‌తో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా: స్మిత్‌

23 Feb, 2021 20:57 IST|Sakshi

సిడ్నీ: ఐపీఎల్‌ 2021 సీజన్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ ఆడడం లేదంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చిన  సంగతి తెలిసిందే. ఆసీస్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ క్లార్క్‌ కూడా స్మిత్‌ ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఆడేది అనుమానమేనంటూ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్‌ స్మిత్‌ నిజంగానే ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతాడేమోనని అంతా భావించారు. కానీ స్మిత్‌ వాటిన్నింటికి తెరదించుతూ ఢిల్లీకి తాను ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. స్మిత్‌ వీడియోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 

వీడియోలో స్మిత్‌ మాట్లాడుతూ.. 'హాయ్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌.. నేను ఈ ఏడాది ఢిల్లీతో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా. నా దృష్టిలో ఢిల్లీకి గొప్ప ఆటగాళ్లతో పాటు మంచి కోచ్‌ కూడా ఉన్నారు. ఐపీఎల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా.. వారితో ఎప్పుడు జ్ఞాపకాలను పెంచుకోవాలా అని చూస్తున్నా. అలాగే గతేడాది ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ ఏడాది మరో మెట్టు ఎక్కించేందుకు ప్రయత్నిస్తా.. అంటే ఢిల్లీకి మొయిడెన్‌ టైటిల్‌ సాధించిపెట్టడమే లక్ష్యం. నాతో పాటు జట్టులోకి వస్తున్న టామ్‌ కరన్‌, సామ్‌ బిల్లింగ్స్‌, ఉమేశ్‌ యాదవ్‌లకు స్వాగతం అంటూ చెప్పుకొచ్చాడు. 

కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.  శ్రెయాస్‌ అయ్యర్‌ సారధ్యంలోని ఢిల్లీ జట్టు లీగ్‌ ఆరంభం నుంచి విజయాలతో జోరు మీద కనిపించింది. శిఖర్‌ ధావన్‌ మెరుపులతో 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. ఆరు ఓటమిలతో  పాయింట్ల పట్టికలో ఢిల్లీ  క్యాపిటల్స్‌ రెండో స్థానంలో నిలిచింది. ముంబైతో జరిగిన క్వాలిఫయర్‌ 1లో ఓటమిపాలైన ఢిల్లీ క్వాలిఫయర్‌ 2లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ను చిత్తుచేసి ఫైనల్లో ప్రవేశించింది. అయితే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ చేతిలో​ 5వికెట్ల తేడాతో పరాజయం పాలైన మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకుంది. తాజాగా ఫిబ్రవరి 18న జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఆసీస్‌కు చెందిన స్టీవ్‌ స్మిత్‌(రూ 2.2 కోట్లు), టామ్‌ కరన్‌(రూ. 5.25 కోట్లు), సామ్‌ బిల్లింగ్స్‌(రూ. 2 కోట్లు0, ఉమేశ్‌ యాదవ్‌(రూ .కోటి) సహా తదితర ఆటగాళ్లను దక్కించుకుంది. కాగా స్మిత్‌  గతేడాది రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున14 మ్యాచ్‌ల్లో 311 పరుగులు సాధించాడు.
చదవండి: 'అంత తక్కువ ధర.. ఐపీఎల్‌ ఆడకపోవచ్చు'
'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్‌ ఆడను'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు