ఆ మ్యాచ్‌కు ముందు 10.. ఇప్పుడు 3

29 Jul, 2020 17:28 IST|Sakshi

మాంచెస్టర్ ‌: వెస్టిండీస్‌‌తో జరిగిన మూడో టెస్టులో పది వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఐసీసీ టెస్ట్ బౌలర్‌ ర్యాంకిగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు.బ్రాడ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ మూడో టెస్టును 269 పరుగుల తేడాతో గెలవడంలో బ్రాడ్‌ కీలకపాత్ర పోషించాడు. రెండు టెస్టుల్లో క‌లిపి మొత్తం 16 వికెట్ల‌తో ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.  ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలిచి విస్డెన్ ట్రోఫీని తిరిగి కైవసం చేసుకుంది.

మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు బ్రాడ్ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు.  మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఏడుస్థానాలు ఎగబాకి మూడోస్థానంలో నిలిచాడు. అలాగే, బ్రాడ్ టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు నమోదు చేసిన ఏడో బౌలర్‌గా అవతరించాడు.  మొదటి ఇన్నింగ్స్‌లో 45 బంతుల్లో 62 పరుగులు చేసి, ఆల్ రౌండర్స్‌ ర్యాంకింగ్‌లో 11 వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఐసీసీ టెస్టు బౌల‌ర్ల టాప్ 10 ర్యాంకింగ్స్ లిస్ట్‌ను ట్విట‌ర్‌లో విడుద‌ల చేసింది.ఈ జాబితాలో ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. కమిన్స్ ఖాతాలో 904 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.త‌ర్వాత వ‌రుస‌గా నీల్ వాగ్నర్ (843), స్టువర్ట్ బ్రాడ్ (823), టిమ్ సౌథీ (812), జాసన్ హోల్డర్ (810) వరుసగా టాప్-5లో ఉన్నారు. (అప్పుడు ఆరు సిక్సర్లు.. ఇప్పుడు ప్రశంసలు)

మరిన్ని వార్తలు