OTD: లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్‌.. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే..! వీడియో చూశారా?

17 Oct, 2023 16:49 IST|Sakshi
సరిగ్గా ఇదే రోజు టెస్టు క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం (PC: X)

Sachin Tendulkar- history Test cricketక్రికెట్‌లో రికార్డులకు మారుపేరు సచిన్‌ టెండుల్కర్‌. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన సుదీర్ఘ కెరీర్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ లెక్కనేనన్ని ఘనతలు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నేటికీ కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

ప్రస్తుత తరం బ్యాటర్లలో ఎవరు ఏ రికార్డు సాధించినా అందులో సగం వరకు సచిన్‌ పేరుతో ముడిపడి ఉంటాయంటే ఈ టీమిండియా లెజెండ్‌ రేంజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

క్రికెట్‌ను పెద్దగా ఇష్టపడని వాళ్లకు సైతం ఆయన పేరు సుపరిచితమే. మరి అలాంటి.. మన క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ కెరీర్‌లో అక్టోబరు 17కు ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా?

సరిగ్గా ఇదే రోజు..
2008లో సరిగ్గా ఇదే రోజు.. మొహాలీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా సచిన్‌ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా.. కంగారూ జట్టు పేసర్‌ పీటర్‌ సిడెల్‌ బౌలింగ్‌లో.. గల్లీ దిశగా బంతిని తరలించాడు సచిన్‌.

లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్‌
ఈ క్రమంలో మూడు పరుగులు సాధించిన లిటిల్‌ మాస్టర్‌.. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌ ముందు వరకు 11,953 పరుగులతో లారా అగ్రస్థానంలో ఉండేవాడు. ఇక 2006లోనే ఈ విండీస్‌ లెజెండ్‌ టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పగా.. 2008లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌‌ సందర్భంగా సచిన్‌ టెస్టుల్లో ఆల్‌టైమ్‌ లీడ్‌ రన్‌స్కోరర్‌గా అవతరించాడు. 

ఆసీస్‌ ఆటగాళ్ల అభినందనలు
ఇక కెరీర్‌లో అరుదైన ఘనత సాధించిన సచిన్‌ టెండుల్కర్‌కు నాడు మొహాలీ ప్రేక్షకులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. నాటి ఆసీస్‌ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ సహా ఇతర ఆటగాళ్లు సచిన్‌ దగ్గరకు వచ్చి అభినందనలు తెలిపారు. 

వంద శతకాల వీరుడు.. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఘనుడు
కాగా 152 టెస్టులో సచిన్‌ టెండుల్కర్‌ 11955 పరుగులతో లారాను అధిగమించగా.. లారా 131 మ్యాచ్‌లలోనే 11953 రన్స్‌ సాధించాడు. అప్పటికి సచిన్‌ అత్యుత్తమ స్కోరు 248 నాటౌట్‌ కాగా.. లారా స్కోరు 400- నాటౌట్‌.

ఇక తన 24 ఏళ్ల కెరీర్‌లో సచిన్‌ టెండుల్కర్‌ మొత్తంగా 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యుత్తమ స్కోరు 248 కాగా.. వన్డేల్లో 200. టెస్టు సెంచరీలు 51. వన్డే సెంచరీలు 49.

చదవండి: టీమిండియాతో మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు