Sudirman Cup: స్టార్‌ ప్లేయర్లు లేకుండానే.. బరిలో భారత జట్టు

26 Sep, 2021 12:18 IST|Sakshi

వాంటా (ఫిన్‌లాండ్‌): స్టార్‌ ప్లేయర్లు సింధు, సైనా, సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి గైర్హాజరీలో ప్రతిష్టాత్మక సుదిర్మన్‌ కప్‌ ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గ్రూప్‌ ‘ఎ’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనా, థాయ్‌లాండ్, ఫిన్‌లాండ్‌ జట్లతో భారత్‌ ఉంది. ఆదివారం జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్‌ ఆడనుంది. 27న రెండో లీగ్‌ మ్యాచ్‌లో చైనాతో, 29న మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఫిన్‌లాండ్‌తో టీమిండియా తలపడనుంది. భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ దశ చేరాలంటే రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది.

ఇక ప్రతి పోటీలో ఐదు మ్యాచ్‌లు (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌) జరుగుతాయి. ఐదింటిలో మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుకు విజయం ఖరారవుతుంది. భారత్‌ తరఫున పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో ఒలింపియన్‌ సాయిప్రణీత్‌ లేదా మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ బరిలోకి దిగుతారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప జంట... పురుషుల డబుల్స్‌లో అర్జున్‌–ధ్రువ్‌ కపిల జోడీ... మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌ లేదా అదితి భట్‌ ఆడే అవకాశముంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి/అశ్విని పొన్నప్పలతో ఎవరు జత కడతారో వేచి చూడాలి. 

►ఈ టోర్నీ తొలి రోజు మ్యాచ్‌లను మధ్యాహ్నం గం. 12:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–3లో ప్రత్యక్ష ప్రసారం  చేస్తారు.

మరిన్ని వార్తలు