#SureshRaina: ఎల్‌పీఎల్‌ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా?

15 Jun, 2023 08:24 IST|Sakshi

శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌ 2023) చరిత్రలో తొలిసారి వేలం జరిగింది. జూన్‌ 14న(బుధవారం) ఎల్‌పీఎల్‌లో వేలం నిర్వహించారు. మొత్తం 360 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇందులో భారత్‌ తరపున రిజిస్టర్‌ చేసుకుంది కేవలం సురేశ్‌ రైనా మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం.. ఐపీఎల్‌లో కూడా ఏ జట్టు తరపున ఆడకపోవడంతో రైనాకు లైన్‌ క్లియర్‌ అయింది. 

ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేసిన సురేశ్‌ రైనాకు లంక ప్రీమియర్‌ లీగ్‌లో మంచి ధర పలుకుతుందని అభిమానులు ఊహించారు. ఒక దశలో సురేశ్‌ రైనా పేరును లంక క్రికెట్‌ బోర్డు ఎల్‌పీఎల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటుందని భావించారు. కానీ వేలం సమయానికి సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది.

వేలం జరుగుతున్న సమయంలో సురేశ్‌ రైనా పేరు ఎక్కడా వినిపించలేదు. అలా అని అన్‌సోల్డ్‌ లిస్ట్‌లో ఉన్నాడా అంటే అది లేదు. మరి రైనా పేరు ఏమైనట్లు అని అభిమానులు కన్ఫూజ్‌కు గురయ్యారు. అయితే విషయమేంటంటే వేలంలో హోస్ట్‌గా వ్యవహరించిన చారుశర్మ సురేశ్‌ రైనా పేరును మరిచిపోయాడా లేక కావాలనే పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అటు రైనా కానీ ఇటు లంక క్రికెట్‌ బోర్డు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైనా లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడతాడా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

వాస్తవానికి రైనా తన బేస్‌ప్రైస్‌ ధరతో సెట్‌ నెంబర్‌ 11లో ఉన్నాడు. ఇదే సెట్‌లో రాసీ వాండర్‌ డుసెన్‌(సౌతాఫ్రికా), ఇమాముల్‌ హక్‌(పాకిస్తాన్‌), ఎవిన్‌ లూయిస్‌(వెస్టిండీస్‌) వంటి స్టార్లు ఉన్నారు. వీరిందరి పేర్లను పలికిన చారు శర్మ రైనా పేరు పలకడం మాత్రం మరిచిపోయాడు. అయితే ఇదే అభిమానులను కన్ఫూజ్‌న్‌కు గురయ్యేలా చేసింది. నిజంగా చారుశర్మ రైనా పేరును పలకడం మరిచిపోయారా.. లేదంటే చివరి నిమిషంలో రైనా పేరును వేలంలో తొలగించారా అనేది క్లారిటీ లేదు. 

టి20 క్రికెట్‌లో సురేశ్‌ రైనాకు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా పేరు పొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సీఎస్‌కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో​ రైనా పాత్ర కీలకం. అంతేకాదు టీమిండియా తరపున 78 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1609 పరుగులు చేసిన రైనా ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్‌ సెంచరీలు ఉండడం విశేషం. 

మరి ఇంతటి ట్రాక్‌ రికార్డు కలిగిన సురేశ్‌ రైనాకు లంక ప్రీమియర్‌ లీగ్‌లో చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేవరకు రైనా ఎల్‌పీఎల్‌ ఆడతాడా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే రైనా ఎల్‌పీఎల్‌లో ఆడనట్లే. ఇక ఎల్‌పీఎల్‌లో ఈసారి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఒక్కడే ఐకాన్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. కొలంబో స్ట్రైకర్స్‌కు బాబర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇక నిన్నటి వేలంలో దిల్షాన్‌ మధుషనక అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. మధుషనకను లైకా జఫ్నా కింగ్స్‌ 92వేల డాలర్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో చరిత్‌ అసలంక 80వేల డాలర్లకు(బేస్‌ ప్రైస్‌ 40వేల డాలర్లు) జఫ్నా కింగ్స్‌.. మూడో స్థానంలో ధనుంజయ డిసిల్వా(బేస్‌ ప్రైస్‌ 40వేల డాలర్లు)ను దంబుల్లా ఆరా 76వేల డాలర్లకు కొనుగోలు చేసింది.  

చదవండి: ఎల్‌పీఎల్‌ చరిత్రలో తొలిసారి వేలం.. అందరి దృష్టి ఆ క్రికెటర్‌పైనే

మరిన్ని వార్తలు