WC 2023: స్విగ్గీ డెలివరీ బాయ్‌, హైకోర్టు ఉద్యోగి.. నెదర్లాండ్స్‌ నెట్‌బౌలర్లుగా మనోళ్లు.. వీళ్లే

21 Sep, 2023 18:49 IST|Sakshi
నెట్‌ బౌలర్లుగా మనోళ్లు నలుగురు(PC: Netherlands X)

ICC ODI WC 2023- Netherlands Net Bowlers: ‘‘మాకు భారత నెట్‌ బౌలర్లు కావాలి.. ఈ అర్హతలు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు..’’ వన్డే వరల్డ్‌కప్‌-2023 సన్నాహకాల్లో భాగంగా భారత్‌లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్‌ జట్టు ఇచ్చిన ఈ ప్రకటన గుర్తుండే ఉంటుంది. 

భారత పౌరుడై.. 18 ఏళ్లకు పైబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంలో బౌలింగ్‌ చేయగల పేసర్లు.. గంటకు 80 కి.మీ వేగంతో బంతిని విసరగల స్పిన్నర్లకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. సోషల్‌ మీడియా వేదికగా డచ్‌ క్రికెట్‌ బోర్డు ఇచ్చిన ఈ ప్రకటనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 

ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన నెదర్లాండ్స్‌ క్రికెట్‌ జట్టు.. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హులైన నలుగురిని తమ నెట్‌ బౌలర్లుగా ఎంచుకుంది. తమ అవసరాలకు అనుగుణంగా ఇద్దరు లెఫ్టార్మ్‌ పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను సెలక్ట్‌ చేసుకుంది. ఇందులో స్విగ్గీ డెలివరీ బాయ్‌ కూడా ఉన్నాడు.

ఆ నలుగురి వివరాలివే!
1. రాజమణి ప్రసాద్‌.. లెఫ్టార్మ్‌ పేసర్‌
►హైదరాబాద్‌, తెలంగాణ
►హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున ఆడిన అనుభవం
►ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ నెట్‌ బౌలర్‌గా ఉన్నాడు.

2. హేమంత్‌ కుమార్‌- లెఫ్టార్మ్‌ పేసర్‌
►చురు, రాజస్తాన్‌
►రాజస్తాన్‌ హైకోర్టులో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌
►2022, 2023 సీజన్లలో రాజస్తాన్‌ రాయల్స్‌ అతడిని నెట్‌బౌలర్‌గా నియమించుకుంది.

3. హర్ష్‌ శర్మ.. లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌
►కురుక్షేత్ర, హర్యానా
►నార్త్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌ విజేత.. ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌
►2022లో ఆర్సీబీ క్యాంపులో నెట్‌బౌలర్‌గా సేవలు అందించాడు.

4. లోకేశ్‌ కుమార్‌- మిస్టరీ బౌలర్‌
►చెన్నై, తమిళనాడు
►జీవనోపాధి కోసం పగలంతా స్విగ్గీలో లోకేశ్‌ పని
►ఐపీఎల్‌లో ఆడాలనే ఆశయం
►ఎనిమిదేళ్ల క్రితం పేసర్‌గా మొదలైన లోకేశ్‌ ప్రస్తుతం మిస్టరీ స్పిన్నర్‌గా మారాడు.
ఇదిలా ఉంటే... హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో పాకిస్తాన్‌తో సెప్టెంబరు 29న నెదర్లాండ్స్‌ తమ తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: నెక్ట్స్ సూపర్‌స్టార్‌.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్‌ రైనా

మరిన్ని వార్తలు