T20 WC 2022: అయ్యో నిసాంక! పాపం కిందపడిపోయాడు.. షూ కూడా! హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

18 Oct, 2022 17:57 IST|Sakshi
పాతుమ్‌ నిసాంక (PC: ICC)

ICC Mens T20 World Cup 2022 - Sri Lanka vs United Arab Emirates: యూఏఈతో మ్యాచ్‌లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు శ్రీలంక ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి 60 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు సాధించాడు. తద్వారా లంక జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు సాయం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

కాసేపు బెంబేలెత్తించాడు!
టీ20 ప్రపంచకప్‌-2022 క్వాలిఫైయర్స్‌లో భాగంగా జీలాంగ్‌ వేదికగా యూఏఈతో తమ రెండో మ్యాచ్‌ ఆడింది దసున్‌ షనక బృందం. తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో కంగుతిన్న ఈ ఆసియాకప్‌-2022 విజేతను యూఏఈ కూడా కాస్త భయపెట్టింది. 

ముఖ్యంగా చెన్నైకి చెందిన యూఏఈ స్పిన్నర్‌ కార్తీక్‌ మెయప్పన్‌ ఒకే ఓవర్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి లంక బ్యాటర్లకు వణుకుపుట్టించాడు. అయితే, పాతుమ్‌ నిసాంక మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు.

పాపం కిందపడిపోయాడు
బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా 18వ ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాహూర్‌ ఖాన్‌ వేసిన బంతిని షాట్‌ ఆడే క్రమంలో నిసాంక బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడిపోయాడు. అతడి షూ కూడా ఊడిపోయింది. అయితే, బంతి బౌండరీ దాటడంతో నాలుగు పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

లంక ఘన విజయం
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పాతుమ్‌ నిసాంక అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి శ్రీలంక 152 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని లంక బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు.

దుష్మంత చమీర 3, వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్‌ మదుషాన్‌ ఒకటి, మహీశ్‌ తీక్షణ రెండు, దసున్‌ షనక ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 17.1 ఓవర్లలోనే 73 పరుగులు చేసి యూఏఈ ఆలౌట్‌ అయింది. ఇక శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో గురువారం తలపడనుంది.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు