హైదరాబాద్‌ ఖేల్‌ఖతమ్‌

17 Jan, 2021 01:41 IST|Sakshi
జగదీశన్‌

తమిళనాడు చేతిలో ఓటమితో నాకౌట్‌ ఆశలు ఆవిరి

ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ

కోల్‌కతా: మరోసారి ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు మూల్యం చెల్లించుకుంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ నాకౌట్‌ చేరుకునే అవకాశాలకు తెరపడింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా తమిళనాడుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది.

సందీప్‌ (36 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా... ఓపెనర్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి (23 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), చివర్లో తనయ్‌ (6 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌), సీవీ మిలింద్‌ (11 బంతుల్లో 24 నాటౌట్‌; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో హైదరాబాద్‌ స్కోరు 150 దాటింది. అనంతరం తమిళనాడు జట్టు 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌ జగదీశన్‌ (51 బంతు ల్లో 78 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (30 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించారు.

వరుసగా నాలుగో విజయం సాధించిన తమిళనాడు జట్టు ప్రస్తుతం గ్రూప్‌ ‘బి’లో 16 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉంది. దాదాపుగా నాకౌట్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బెంగాల్‌ జట్టు 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒకే విజయం సాధించిన హైదరాబాద్‌ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో తమిళనాడు, బెంగాల్‌ తలపడనున్నాయి. ఒకవేళ తమిళనాడు ఓడిపోతే బెంగాల్‌ కూడా 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే బెంగాల్‌కంటే తమ నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటం తమిళనాడుకు కలిసొచ్చే అంశం. సోమవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో జార్ఖండ్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది.

మరిన్ని వార్తలు