టీమిండియా ప్రాక్టీస్‌ షురూ

16 Nov, 2020 06:25 IST|Sakshi

కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో సుదీర్ఘ సిరీస్‌ కోసం భారత జట్టు ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఐపీఎల్‌ ముగిశాక దుబాయ్‌ నుంచి నేరుగా సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లకు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరి ఫలితాలు నెగెటివ్‌గా రావడంతో ఆటగాళ్లు అవుట్‌డోర్‌ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో, జిమ్‌లో చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది.

సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌ మైదానంలో హార్దిక్‌ పాండ్యా, పృథ్వీ షా, హనుమ విహారి, చతేశ్వర్‌ పుజారా, స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, చహల్, పేసర్లు ఉమేశ్‌ యాదవ్, సిరాజ్,  ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌ వార్మప్‌ చేస్తూ జాలీగా కనిపించారు. టీమిండియా కొత్త ఆటగాళ్లు నటరాజన్, దీపక్‌ చహర్‌ కూడా బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మూడు ఫార్మాట్‌లకు (టెస్టు, వన్డే, టి20) చెందిన భారత ఆటగాళ్లందరూ ఒకేసారి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆదివారం నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా జరిగింది. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన ఎడంచేతి వాటం పేసర్‌ నటరాజన్‌ తెల్లబంతులతో టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేశాడు. పుజారా, కోహ్లి క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ కూడా చేశారు. నవంబర్‌ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆసీస్‌తో భారత్‌ 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు ఆడనుంది.  

మరిన్ని వార్తలు