Thailand Open 2023: సింధు, శ్రీకాంత్‌లకు చుక్కెదురు

1 Jun, 2023 02:47 IST|Sakshi

తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ

సైనా, లక్ష్య సేన్‌ ముందంజ  

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్‌ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్‌ మంజునాథ్‌... మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్‌ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్‌లో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.  

ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌కు కిరణ్‌ షాక్‌
పురుషుల సింగిల్స్‌లో 26వ ర్యాంకర్‌ వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో 21వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్‌ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్‌ (మలేసియా) చేతిలో, సమీర్‌ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్‌ (డెన్మార్క్‌), మిథున్‌ (భారత్‌) 21–17, 8–21, 15–21తో కున్లావుత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్‌ కిరణ్‌ జార్జ్‌ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్‌ 21–23, 21–15, 21–15తో వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)పై కష్టపడి గెలిచాడు.  

26 నిమిషాల్లోనే...
దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్‌లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్‌ జు జాంగ్‌ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్‌ అష్మిత 21–17, 21– 14తో భారత్‌కే చెందిన మాళవికను ఓడించింది.

తొమ్మిదేళ్ల తర్వాత...
కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్‌ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్‌ జెర్‌ –సొగార్డ్‌ (డెన్మార్క్‌) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది.

మరిన్ని వార్తలు