జర్మనీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌పై జాతి వివక్ష కామెంట్లు.. ఒలింపిక్స్‌ ముందట రచ్చ

18 Jul, 2021 09:15 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ ముగింట ‘జాతి’ వివక్ష వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జర్మనీ ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాడు జోర్డాన్‌ టోరునారిను ఉద్దేశించి ప్రత్యర్థి ఆటగాళ్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్‌ అమెరికా జట్టు హోండురస్‌తో శనివారం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

జపాన్‌ వాకయామా స్టేడియంలో ఇరు జట్లు తలపడగా.. ఆట మధ్యలో జోర్డాన్‌ను ఉద్దేశించి హోండురస్‌ ఆటగాళ్లు వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని జర్మన్‌ ఫుట్‌బాల్‌ అసోషియేషన్‌ ట్వీట్‌ ద్వారా వెల్లడించింది. ఆటగాళ్లను విమర్శించినప్పుడు ఆటను కొనసాగించడం కరెక్ట్‌ కాదని, అందుకే మైదానం వీడినట్లు హెడ్‌కోచ్‌ స్టెఫాన్‌ కుంట్జ్‌ ఒక ప్రకటనలో చేసిన పనిని సమర్థించుకున్నారు.

ఆట ముగియడానికి ఐదు నిమిషాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అప్పటికే స్కోర్‌ 1-1తో సమంగా ఉంది. అయితే గ్రౌండ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నగొడవ వల్లే అలా జరిగిందని హోండరస్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ తెలిపింది. ఈ ఘటనను పలు దేశాల ఫుట్‌బాల్‌ ఫెడరేషన్లు ఖండిస్తున్నాయి.  టోక్యో ఒలింపిక్స్‌ కమిటీ ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే నైజీరియా సంతతికి చెందిన టోరునారిగా ఇలాంటి వివక్షకు గురికావడం ఇదే తొలిసారి కాదు. కిందటి ఏడాది ఓ మ్యాచ్‌ సందర్భంగా చాకె ఫ్యాన్స్‌ ‘మంకీ’ నినాదాలతో గ్రౌండ్‌ను హోరెత్తించారు.

మరిన్ని వార్తలు