Tokyo Olympics Foot Ball: ఫ్రాన్స్‌కు షాకిచ్చిన మెక్సికో.. డ్రాతో గట్టెక్కిన స్పెయిన్‌

22 Jul, 2021 20:51 IST|Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌ పోటీలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే ఫుట్‌బాల్‌ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. గ్రూప్‌-సిలో భాగంగా గురువారం స్పెయిన్-ఈజిప్ట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రా(0-0) కాగా, గ్రూప్-ఏలో భాగంగా మెక్సికో-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో మెక్సికో.. బలమైన ఫ్రెంచ్‌ జట్టుకు షాకిచ్చింది. ఫ్రాన్స్‌పై మెక్సికో 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సెకండాఫ్‌లో అలెక్సిస్ వెగా, సెబాస్టియన్ కార్డోవా, యూరియల్ ఆంటునా, ఎరిక్ అగిర్‌లు తలో గోల్ చేయడంతో మెక్సికో ఫ్రాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. 

మరోవైపు యూరో కప్ 2020 సెమీ ఫైనలిస్ట్‌ స్పెయిన్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు గాయపడంతో ఆ జట్టు పేలవ ప్రదర్శనతో అతికష్టం మీద డ్రాతో గట్టెక్కింది. కాగా, స్పెయిన్‌ జట్టు చివరిసారిగా 1992 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. 

ఇక గ్రూప్‌ బిలో న్యూజిలాండ్-దక్షిణ కొరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ వుడ్ గోల్ వేయడంతో ఆ జట్టు 1-0తో విజయం సాధించింది. ఇక తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొనాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోక్యోకు బయలుదేరే ముందు దక్షిణాఫ్రికా జట్టులోని కొందరు కరోనా బారిన పడ్డారు. వారి బృందం టోక్యోకు చేరుకోగానే ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

మరిన్ని వార్తలు