US Open 2021: ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్.. యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌

13 Sep, 2021 07:39 IST|Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ 2021లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌, సెర్బియా స్టార్ నోవాక్‌ జకోవిచ్‌ను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ ఎగరేసుకుపోయాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం జరిగిన ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో జకోను ఓడించాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుతో పాటు కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధిద్దామనుకున్న జకో ఆశలపై నీళ్లు చల్లాడు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ తుది సమరంలో ప్రపంచ నంబర్‌ 2 ఆటగాడు మెద్వెదెవ్‌, జకోవిచ్‌ నువ్వానేనా అన్నట్లుగా ఆడారు. మెద్వెదెవ్‌ అద్భుత ఆటతో తొలి సెట్‌ను 6-4 తేడాతో గెలిచుకుని జకోవిచ్‌పై పైచేయి సాధించాడు. రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్‌ బ్రేక్‌లతో విరుచుకుపడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరింది. అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మెద్వెదెవ్‌ 6-4తో రెండో సెట్‌ను సైతం కైవసం చేసుకున్నాడు.

నిర్ణయాత్మక మూడో సెట్‌లో 34 ఏళ్ల జకోవిచ్‌ మొదట తేలిపోయినప్పటికీ.. తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ 25 ఏళ్ల మెద్వెదెవ్‌ విజయాన్ని 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత జకో అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్‌ను కూడా మెద్వెదెవ్‌ 6-4 తేడాతో గెలిచుకుని అర్ధశతాబ్దం తర్వాత నమోదవుతుందనుకున్న కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ రికార్డుకు బ్రేకులు వేశాడు. 2019లో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి ఓటమి పాలైన మెద్వెదెవ్‌ ఎట్టకేలకు ఈసారి టైటిల్‌ అందుకున్నాడు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, రఫెల్ నాదల్‌ సరసన నిలిచిన జకో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామనకున్నాడు. అయితే జకో ఆశలపై మెద్వెదెవ్‌ నీళ్లు చల్లాడు. కాగా, మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రెడుకాను (బ్రిటన్‌) విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
చదవండి:  ఐపీఎల్‌ ప్యానెల్‌లో వివాదాస్పద వ్యాఖ్యాతకు నో ప్లేస్‌..

మరిన్ని వార్తలు