వెలాసిటీ బోణీ

5 Nov, 2020 05:41 IST|Sakshi
సునె లూస్‌ సంబరం, సుష్మ

సూపర్‌ నోవాస్‌పై ఐదు వికెట్లతో గెలుపు

సుష్మ, లూస్‌ మెరుపులు

మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ

షార్జా: మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలో హైదరాబాద్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ నాయకత్వంలోని వెలాసిటీ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఐదు వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని సూపర్‌ నోవాస్‌ జట్టుపై గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌ నోవాస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్‌ చమరి ఆటపట్టు (39 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించింది. ఏక్తాబిష్త్‌ 3 వికెట్లు తీసింది. తర్వాత వెలాసిటీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సునె లూస్‌ (21 బంతుల్లో 37 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), సుష్మ వర్మ (33 బంతుల్లో 34; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.    

రాణించిన చమరి...
ఓపెనర్‌ ప్రియా (11), జెమీమా రోడ్రిగ్స్‌ (7) విఫలమైనా... మరో ఓపెనర్‌ చమరి ఆటపట్టు కుదరుగా ఆడింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. మనాలీ, కాస్పెరెక్‌ ఓవర్లలో సిక్సర్లు బాదిన చమరి దూకుడుకు జహనార చెక్‌ పెట్టింది. కాసేపటికే హర్మన్‌ (27 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను జహనార పెవిలియన్‌ చేర్చగా... తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారిలో సిరివర్దెనె (18) మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 20వ ఓవర్‌ వేసిన ఏక్తా బిష్త్‌ ఆఖరి రెండు బంతుల్లో రాధా యాదవ్‌ (2), షకీరా (5)లను అవుట్‌ చేసింది. జహనార, కాస్పెరెక్‌ చెరో 2 వికెట్లు తీశారు.  

ఆఖర్లో ఉత్కంఠ...
బంతికో పరుగు చొప్పున చేయాల్సిన లక్ష్యం. కానీ ఖాతా తెరువకుండానే ఓపెనర్‌ వ్యాట్‌ (0)ను, లక్ష్యఛేదనలో సగం పరుగులు చేయగానే షఫాలీ (11 బంతుల్లో 17), కెప్టెన్‌ మిథాలీ (7), వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. 13 ఓవర్లలో వెలాసిటీ స్కోరు 65/4. ఇంకా 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన సమీకరణం. చివరి 5 ఓవర్లలో అయితే ఓవర్‌కు 10 చొప్పున 50 పరుగులు చేయాలి. లక్ష్యానికి దాదాపు దూరమైన తరుణంలో సుష్మ, సునె లూస్‌ భారీ షాట్లతో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశారు. పూనమ్‌ 16వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్‌ బాదడంతో 14 పరుగులు, సిరివర్దెనె 17వ ఓవర్లో 11 పరుగులు రావడంతో లక్ష్యం సులువైంది. సుష్మ అవుటైనా... ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లూస్, శిఖాపాండే చెరో బౌండరీతో గెలిపించారు.

నేడు జరిగే మ్యాచ్‌లో వెలాసిటీతో ట్రయల్‌ బ్లేజర్స్‌ తలపడుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు