Vijay Hazare Trophy: తమిళనాడుకు షాక్‌.. చరిత్ర సృష్టించిన హిమాచల్‌ ప్రదేశ్‌.. తొలిసారి చాంపియన్‌గా..

26 Dec, 2021 18:12 IST|Sakshi

Himachal Pradesh Created History with their first-ever domestic title: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హిమాచల్‌ ప్రదేశ్‌ చరిత్ర సృష్టించింది. విజయ్‌ హజారే ట్రోఫీలో మొట్టమొదటిసారి చాంపియన్‌గా అవతరించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌లో తమిళనాడును ఓడించి ట్రోఫీని ముద్దాడింది.  ఓపెనర్‌ శుభమ్‌ అరోరా 136 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు తీర్చాడు. అమిత్‌ కుమార్‌ 74 పరుగులతో రాణించాడు. ఇక కెప్టెన్‌ రిషి ధావన్‌ 42 పరుగులు సాధించి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 

విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీలో భాగంగా జైపూర్‌లో జరిగిన ఫైనల్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌.. తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలో తడబడినా దినేశ్‌ కార్తిక్‌, షారుక్‌ ఖాన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో తమిళనాడు జట్టు మంచి స్కోరు నమోదు చేసింది. 49.4 ఓవర్లలో 314 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్‌ ప్రదేశ్‌కు శుభమ్‌ శుభారంభం అందించాడు. ఇక​ వెలుతురు లేమి కారణంగా వీజేడీ మెథడ్‌ ద్వారా.. 47.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. దీంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. 131 బంతుల్లో 136 పరుగులు చేసిన శుభమ్‌ అరోరా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  తమిళనాడు బౌలర్లలో సాయి కిషోర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మురుగన్‌ అశ్విన్‌, బాబా అపరాజిత్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

మరిన్ని వార్తలు