ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..

22 Dec, 2023 13:21 IST|Sakshi

కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్‌ మోడల్‌ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్‌ మోడల్‌ ఐడియాతో మార్కెట్‌లో లిస్ట్‌అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్‌ ఐపీఓల గురించి తెలుసుకుందాం.

ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్‌ఈడీఏ, సియెట్‌ డీఎల్‌ఎం, టాటా టెక్నాలజీస్‌, సెన్కో గోల్డ్‌ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి.

ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్‌లో టాప్‌లో ఇండియన్‌ రెన్యూవెబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ లిమిటెడ్‌(ఐఆర్‌ఈడీఏ) నిలిచింది. నవంబర్‌లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్‌ ట్రేడవుతోంది.

పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్‌ టీఎల్‌ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది.

ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..?

ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్‌ గెయిన్స్‌తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్‌లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్‌ నిలిచింది. జులైలో  ఈ కంపెనీ ఐపీగా లిస్ట్‌ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్‌ బ్యాండ్‌ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది.

>
మరిన్ని వార్తలు