ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కంపెనీల ఆటలు ఇక సాగవు!

22 Dec, 2023 14:18 IST|Sakshi

ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్‌ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటలు వంటి ఇబ్బందలు ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బాసటగా నిలిచింది. ఉద్యోగులను వేధించే ఐటీ కంపెనీల ఆట కట్టిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) రంగంలో కంపెనీలు ఉద్యోగుల పట్ల అనుచిత విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వీటిని రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది.

చాలా ఐటీ కంపెనీల్లో ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్‌ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటల వంటి విషయాలు కార్మిక శాఖ దృష్టికి వచ్చాయని అదనపు లేబర్ కమిషనర్ డాక్టర్ జి.మంజునాథ్ తెలిపారు. వీటిలో కొన్నింటిని లేబర్‌, ఇండస్ట్రియల్‌ కోర్టులకు రిఫర్ చేసినట్లు చెప్పారు.

ఇక మినహాయింపు లేదు!
'సన్‌రైజ్ ఇండస్ట్రీస్'గా పరిగణిస్తున్న ఐటీ కంపెనీలకు కర్ణాటక పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946 నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా మినహాయింపు ఇస్తూ వస్తోంది. చివరిసారిగా 2019 మే 21న ఐదేళ్లపాటు ఈ మినహాయింపును పొడిగించింది. కానీ ఈసారి మినహాయింపును పొడిగించకుండా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయా కంపెనీలను శాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

కర్ణాటకలో మొత్తం 8,785 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 18 లక్షల మంది పనిచేస్తున్నారు. కోవిడ్ తర్వాత, కంపెనీల వేధింపులపై అనేక ఫిర్యాదులు డిపార్ట్‌మెంట్‌లో నమోదయ్యాయి. ఈ  ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఈ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946ని ఆయా కంపెనీలకు వర్తింపజేయడం అవసరమని అదనపు లేబర్ కమిషనర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది?

>
మరిన్ని వార్తలు