ఈ దశాబ్దపు మేటి క్రికెటర్‌ కోహ్లి

29 Dec, 2020 02:07 IST|Sakshi

రెండు పురస్కారాలు నెగ్గిన భారత కెప్టెన్‌ 

ఐసీసీ అవార్డులు

దుబాయ్‌: మన కోహ్లి మరో రెండు పురస్కారాలకి ఎంపికయ్యాడు. అలాగే ధోని కీర్తిలో ఇప్పుడు ‘క్రీడాస్ఫూర్తి’ చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన దశాబ్దపు మేటి సారథులుగా మన ఆటగాళ్లే (ధోని, కోహ్లి) నిలిచారు. ఇప్పుడు వ్యక్తిగతంగానూ మేటి క్రికెటర్లుగా ఎంపికయ్యారు. గత పదేళ్ల ప్రపంచ క్రికెట్‌లో పురుషుల విభాగంలో అత్యుత్తమ క్రికెటర్‌ (సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డు) విరాట్‌ కోహ్లి అని ఐసీసీ ప్రకటించింది. ‘దశాబ్దపు వన్డే క్రికెటర్‌’ కూడా అతనే కావడం మరో విశేషం.

ఈ పదేళ్ల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌ (మూడు ఫార్మాట్లు)లో విరాట్‌ 66 సెంచరీలు సాధించాడు. అలాగే 94 ఫిఫ్టీలు ఉన్నాయి. 56.97 సగటుతో 20,396 పరుగులు చేశాడు. మొత్తం 70కి మించి ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లలో కోహ్లినే అగ్రగణ్యుడని ఈ గణాంకాల ద్వారా ఐసీసీ ప్రకటించింది. ఇందులో పోటీపడిన అశ్విన్, రూట్‌ (ఇంగ్లండ్‌), సంగక్కర (శ్రీలంక), స్మిత్‌ (ఆస్ట్రేలియా), డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా), కేన్‌ విలియమ్సన్‌ (కివీస్‌) అతని నిలకడ ముందు వెనుకబడ్డారు.

ప్రత్యేకించి వన్డేల్లో 61.83 సగటుతో 12,040 పరుగులు, 39 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు చేయడం ద్వారా కోహ్లి ‘దశాబ్దపు వన్డే క్రికెటర్‌’గానూ ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలోనూ దశాబ్దపు క్రికెట్‌ జట్లలో ఉన్న ఏకైక ఆటగాడు కూడా కోహ్లినే! ఓవరాల్‌గా అతని కెరీర్‌లో 70 శతకాలు బాదాడు. ఆస్ట్రేలియా స్టార్‌ స్మిత్‌ దశాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా, అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ దశాబ్దపు ఉత్తమ టి20 క్రికెటర్‌గా నిలిచారు. గత పదేళ్ల కాలంలో స్మిత్‌ 69 టెస్టులు ఆడి 65.79 సగటుతో 7,040 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు ఉన్నాయి. రషీద్‌ ఖాన్‌ 48 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు తీశాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓటింగ్‌ ద్వారా ఈ అవార్డీలను ఎంపిక చేశారు. ఈ ఓటింగ్‌లో 53 లక్షల మంది పాల్గొన్నారు.

మహిళల్లో ఎలీస్‌ పెర్రీ బెస్ట్‌...
మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఎలీస్‌ పెర్రీ అందుబాటులో ఉన్న మూడు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. 30 ఏళ్ల ఎలీస్‌ ఈ దశాబ్దపు ఉత్తమ మహిళా క్రికెటర్, ఉత్తమ వన్డే క్రికెటర్, ఉత్తమ టి20 క్రికెటర్‌గా ఎంపికైంది. గత పదేళ్ల కాలంలో ఎలీస్‌ పెర్రీ 73 వన్డేలు ఆడి 2,621 పరుగులు చేసి 98 వికెట్లు తీసింది. 100 టి20 మ్యాచ్‌లు కూడా ఆడిన ఆమె 1,155 పరుగులు చేసి 89 వికెట్లు పడగొట్టింది. మరోవైపు ఆరు టెస్టుల్లో బరిలోకి దిగి 453 పరుగులు చేసింది. ఇందులో ఒక డబుల్‌ సెంచరీ, సెంచరీ, అర్ధ సెంచరీ ఉన్నాయి. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌ క్రీడలోనూ ఎలీస్‌ పెర్రీకి ప్రవేశం ఉంది. ఆమె ఆస్ట్రేలియా మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు 18 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి మూడు గోల్స్‌ కూడా చేసింది.

మరిన్ని వార్తలు