ఫ్యాన్స్‌తో కళకళలాడుతున్న చెపాక్‌

13 Feb, 2021 12:05 IST|Sakshi

చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకు బీసీసీఐ 50 శాతం ప్రేక్షకులను మైదానాల్లోకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చెపాక్‌ స్టేడియం అభిమానులతో కళకళలాడుతుంది. దాదాపు ఏడాది విరామం తర్వాత భారత్‌లో మ్యాచ్‌ జరగడంతో మైదానంలో మ్యాచ్‌ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు.  50వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న చిదంబరం స్టేడియంలో 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో 15వేల మందికి మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పించడంతో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఈ సందర్భంగా బీసీసీఐ వీడియోను రిలీజ్‌ చేసింది. 'చెన్నై స్టేడియానికి కొత్త కళ వచ్చింది. సుధీర్ఘ కరోనా విరామం తర్వాత మైదానంలో అభిమానులను చూడడం సంతోషంగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది.

తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫేస్‌ మాస్క్‌ ఉన్న ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించినట్లు తెలిపారు. అయితే  మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎవరు రూల్స్‌ పాటించడకపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. కాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో మాత్రం ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 80 పరుగులతో దాటిగా ఆడుతుండడంతో లంచ్‌ విరామం సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రహానే 5 పరగులతో రోహిత్‌కు సహకరిస్తున్నాడు. అంతకముందు కెప్టెన్‌ కోహ్లి, గిల్‌లు డకౌట్‌గా వెనుదిరగ్గా.. పుజారా 21 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరిన్ని వార్తలు