మ్యాచ్‌ మధ్యలో కోహ్లి, రూట్‌ ఏం మాట్లాడారో!

5 Feb, 2021 17:35 IST|Sakshi

చెన్నై: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ టీమిండియాపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ 128 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అసలు విషయంలోకి వెళితే.. ఆట తొలి సెషన్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ 40 సెకన్ల పాటు చిట్‌చాట్‌ చేసుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇషాంత్‌ వేసిన 34వ ఓవర్‌ తర్వాత బ్రేక్‌ సమయంలో వీరిద్దరు చాట్‌ చేసుకున్నట్లు వీడియోలో కనిపించింది.

అయితే వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనే దానిపై స్పష్టత లేదు. కోహ్లి, రూట్‌ చిట్‌చాట్‌పై కామెంటరీ బాక్స్‌లో ఉన్న కామెంటేటర్స్‌ మాత్రం వినూత్న రీతిలో స్పందించారు.' మ్యాచ్‌ సమయంలో ఇద్దరు గొప్ప ఆటగాళ్లు మాట్లాడుకోవడం చూడడానికి చాలా బాగుంది. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది పక్కన పెడితే.. ఇద్దరు కెప్టెన్లకు అలా చూడడం ఆసక్తి కలిగించిందంటూ' నిక్‌ నైట్‌ తెలిపాడు. బహుశా వారిద్దరి మధ్య టాస్‌ అంశం గురించి కానీ లేకపోతే పిచ్‌ శైలి ఎలా ఉందనే అంశం లేక బ్యాటింగ్‌ అంశంపై మాట్లాడి ఉండొచ్చు. ఏదైమైనా ఇద్దరు కెప్టెన్లు ఇలా స్పోర్టివ్‌నెస్‌తో ఉండడం కళ్లకు నిండుగా ఉంది. వారిద్దరి స్నేహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటివి అంతర్జాతీయ క్రికెట్‌లో సహజం ' అంటూ మురళీ కార్తిక్‌ చెప్పుకొచ్చాడు. 

కాగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ తన 100వ టెస్టు మ్యాచ్‌ను మధురానుభూతిగా మల్చుకున్నాడు. వందో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించిన తొమ్మిదో ఆటగాడిగా.. 98,99,100వ టెస్టులో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. రూట్‌ ఇంకా ఆడుతుండడంతో రెండో రోజు ఇంగ్లండ్‌ వేగంగా ఆడి భారీ స్కోరు నమోదు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసే అవకాశం ఉంది.

చదవండి: చెన్నై టెస్ట్‌లో అరుదైన ఘటన
                 జో రూట్‌ అరుదైన ఘనత

మరిన్ని వార్తలు