ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు

6 Jan, 2021 16:42 IST|Sakshi

క్రైస్ట్‌చర్చి:  పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో కివీస్‌ 176 పరుగులు ఇన్నింగ్స్‌ తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది. కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ డబుల్‌ సెంచరీతో మెరవడమేగాక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ విజయం అనంతరం కెప్టెన్‌ విలియమ్సన్‌ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది')

కివీస్ సహచర‌ ఆటగాడు బీజే వాట్లింగ్‌ విలియమ్సన్‌ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలని కోరాడు. దీంతో అనుకోని సంఘటనతో మొదట విలియమ్సన్‌ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే వెంటనే చిరునవ్వు అందుకుంటూ వాట్లింగ్‌ తెచ్చిన షర్ట్‌పై తన సంతకాన్ని చేశాడు. ఈ వీడియోనూ బ్లాక్‌ క్యాప్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయగా ఇది కాస్త వైరల్‌గా మారింది. పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో తన సహచర ఆటగాడు ఆటోగ్రాఫ్‌ అడుగుతాడని విలియమ్సన్‌ బహుశా ఊహించి ఉండంటూ' క్యాప్షన్‌ జత చేసింది. 


కాగా రెండో టెస్టులో మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అనంతరం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో 362 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. తొమ్మిది గంటల పాటు మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తన కెరీర్‌లో నాలుగో డబుల్‌ సెంచరీ (238; 28 ఫోర్లు) సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక హెన్రీ నికోల్స్‌ (157; 18 ఫోర్లు, సిక్స్‌), డారిల్‌ మిచెల్‌ (102 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకాలు బాదడంతో కివీస్‌ భారీ స్కోరును అందుకుంది.

విలియమ్సన్, నికోల్స్‌ నాలుగో వికెట్‌కు 369 పరుగులు జోడించారు. 362 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాకిస్తాన్‌ కివీస్‌ బౌలర్‌ కైల్‌ జేమిసన్‌ దాటికి 186 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.  అజహర్‌ అలీ(37), జాఫర్‌ గౌహర్‌(37) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో జెమీసన్‌ మొత్తంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు.(చదవండి: ముంబైలో అయినా ఓకే: ఆసీస్‌ కెప్టెన్‌‌)

మరిన్ని వార్తలు