PM Modi - Nikhat Zareen: ప్రధాని మోదీని కలుసుకున్న నిఖత్‌ జరీన్‌.. ఫోటోలు వైరల్‌

1 Jun, 2022 21:20 IST|Sakshi

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌జరీన్‌ బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. నిఖత్‌ జరీన్‌తో పాటు యువ బాక్సర్లు మనీష్‌ మౌన్‌, పర్వీన్‌ హుడాలు కూడా ఉన్నారు. మోదీని కలిసిన నిఖత్‌ జరీన్‌ తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపిస్తూ ప్రధానితో సెల్ఫీ దిగింది. ఆ తర్వాత మనీష్‌ మౌన్‌, పర్వీన్‌ హుడా, నిఖత్‌ జరీన్‌లతో కలసి ఫోటో దిగిన మోదీజీ వారితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిఖత్‌  జరీన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారాయి.''ప్రధాని మోదీ జీ.. మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.. థాంక్యూ సర్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇటీవలే టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ స్వర్ణం సాధించి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 52 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో నిఖత్‌ జరీన్‌.. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పోంగ్‌ జుట్మస్‌ను 5-0(30-27, 29-28, 29-28,30-27, 29-28)తో పంచ్‌ల వర్షం కురిపించింది. 2018లో మేరీకోమ్‌ తర్వాత ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌లో ఒక భారత బాక్సర్‌ స్వర్ణం గెలడవం మళ్లీ ఇదే. కాగా నిఖత్‌ జరీన్‌ భారత్‌ తరపున ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళగా రికార్డులకెక్కింది. నిఖత్‌ జరీన్‌ కంటే ముందు మేరీకోమ్‌(ఐదుసార్లు), సరితాదేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖా కేసీలు ఉన్నారు.


ఇక 57 కేజీల విభాగంలో మనీషా మౌన్‌.. 63 కేజీల విభాగంలో పర్వీన్‌ హుడాలు కాంస్య పతకం సాధించారు. 73 దేశాల నుంచి 310 మంది బాక్సర్లు పాల్గొన్న ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో 12 మంది భారత మహిళా బాక్సర్లు పాల్గొన్నారు. వీరిలో 8 మంది కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ చేరడం విశేషం. టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌లో భారత్‌ సాధించిన మూడు పతకాలతో మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. ఇందులో 10 స్వర్ణాలు, 8 రజతాలు, 21 కాంస్యాలు ఉన్నాయి. ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పతకాల పట్టికలో రష్యా(60), చైనా(50) తర్వాతి స్థానంలో భారత్‌(39) ఉండడం విశేషం. 

చదవండి: బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్‌ భారీ నజరానా

మరిన్ని వార్తలు