బ్రాడ్‌ను మ‌న‌స్పూర్తిగా అభినందించండి: యూవీ

29 Jul, 2020 15:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇంగ్లండ్ సీనియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ 500 వికెట్ల మైలురాయిని సాధించ‌డం ప‌ట్ల క్రికెట్ అభిమానుల‌తో పాటు ప‌లువురు క్రికెట‌ర్లు అత‌న్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ బ్రాడ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. వీరిద్ద‌రి ప్ర‌స్తావ‌న వ‌చ్చిందంటే 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గుర్తుకురాక మాన‌దు. ఆండ్రూ ఫ్లింటాఫ్ మీద‌ కోపంతో బ్రాడ్ వేసిన ఆరు బంతుల‌ను యూవీ ఆరు సిక్సులుగా మ‌లిచి అత‌డి కెరీర్‌లో ఆ ఓవ‌ర్‌ను ఒక పీడ క‌ల‌గా మిగిల్చాడు. తాజాగా 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న బ్రాడ్‌ను యూవీ ట్విట‌ర్ వేదిక‌గా త‌న‌దైన శైలిలో ప్ర‌శంసించాడు.(అదరగొట్టిన బ్రాడ్‌.. సిరీస్‌ ఇంగ్లండ్‌దే)

'బ్రాడ్ గురించి చెప్పాల‌నుకున్న ప్ర‌తీసారి అభిమానులు 2007 టీ20 ప్ర‌పంచ‌ప‌క‌ప్ మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌కు బ‌లైన బ్రాడ్‌లానే చూస్తారు. కానీ ఈసారి అభిమానులకు ఒక విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. ఆ విష‌యం వ‌దిలేయండి.. బ్రాడ్‌ను మ‌న‌స్పూర్తిగా అభినందించండి. ఎందుకంటే టెస్టుల్లో 500 వికెట్ల‌ను సాధించ‌డ‌మ‌నేది చాలా గొప్ప విష‌యం. ఆ మ్యాజిక్‌ను బ్రాడ్ చేసి చూపించాడు. 500 వికెట్ల ఫీట్‌ను సాధించ‌డం కోసం బ్రాడ్ అంకిత‌భావంతో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. నిజంగా బ్రాడ్ ఒక లెజెండ్.. హాట్సాఫ్' అంటూ యూవీ ట్వీట్ చేశాడు.

క్రికెట్‌ ప్రపంచంలో 500 వికెట్లు తీసిన 7వ బౌలర్‌గా నిలవడంతో పాటు ఈ రికార్డును సాధించిన ఫాస్ట్‌ బౌలర్లలో నాలుగో ఆటగాడిగా బ్రాడ్‌ నిలిచాడు. టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ‌వారిలో వ‌రుస‌గా ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌(800), షేన్ వార్న్‌(708), అనిల్ కుంబ్లే(619), జేమ్స్‌ అండర్సన్‌(589), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (563), కౌట్నీ వాల్ష్‌( 519) ఉన్నారు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌ తరపున 140 టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బ్రాడ్‌ నిలిచాడు. (ధోని తర్వాత అంతటి గొప్ప కెప్టెన్ తనే‌: రైనా)

మరిన్ని వార్తలు