కోవిడ్‌ వారియర్స్‌ ఆహారంలో పురుగులు

29 Jul, 2020 15:43 IST|Sakshi

లక్నో: కరోనాపై పోరులో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయక.. రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటూ పేషంట్లకు వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం నిజంగా క్షమార్హం. మంచి భోజనం అందించడం కనీస బాధ్యత. కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ (కేజీఎంయూ) వైద్య సిబ్బందికి అందించిన ఆహారంలో పురుగులు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఇలా జరగడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా అనేకసార్లు ఆహారంలో పురుగులు కనిపించాయి. దాంతో ప్రస్తుతం కేజీఎంయూ మెడికల్ సిబ్బంది దీని గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. (ఆస్పత్రి పడక.. తప్పుల తడక!)

వివరాలు.. రెయిన్‌ బసేరా క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటున్న కేజీఎంయూ ఎమర్జెన్సీ మెడిసిన్‌ సర్వీస్‌ విభాగంలో పనిచేసే క్లీనింగ్‌ సిబ్బందికి అందజేసిన ఆహారం ప్యాకెట్‌లో పురుగులు వచ్చాయి. గతంలో కూడా రెసిడెంట్‌ వైద్యులు, నాన్‌ క్లినికల్‌ సిబ్బందికి అందించిన ఆహారంలోనూ పురుగులు కనిపించాయి. దీని గురించి చాలాసార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన లేదు. దాంతో ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అంతేకాక డ్యూటీ అవర్స్‌ అయిపోయాక విశ్రాంతి తీసుకోవడానికి రెసిడెంట్‌ డాక్టర్లుకు కేటాయించిన గదుల్లో ఫ్యాన్లు కూడా సరిగా పని చేయడం లేదని తెలిపారు. కోవిడ్‌-19 డ్యూటీలో ఉన్న వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. నాణ్యతలేని ఆహారం తీసుకుంటే వైద్య సిబ్బంది కూడా అనారోగ్యం పాలవుతారని సూచిస్తున్నారు. (మాస్కు ధరించనందుకు మహిళపై..)

బస్తి జిల్లా వైద్యులు కూడా ఆహారం నాణ్యత పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అందిస్తోన్న నాణ్యత లేని ఆహారం ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కోవిడ్‌ పేషంట్లతో పాటు వారికి సేవలందించే వైద్యులకు మంచి భోజనం అందించడం కనీస బాధ్యత అని తెలిపారు. కుటుంబాలకు దూరంగా ఉండి పేషంట్లకు చికిత్స చేస్తున్న వైద్యులకు మంచి ఆహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా