ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

1 Jun, 2023 10:26 IST|Sakshi
జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయం

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అనిల్‌

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

దగదర్తి (కావలి): వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. దగదర్తి మండలం వెలుపోడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్ధిని గణాంకాలతో సహా వివరించే బుక్‌లెట్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల జీవితాలను మార్చేందుకు సంక్షేమ పథకాలకు అత్యధిక నిధులు వెచ్చించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనలో నూతన శకానికి నాంది పలికారని తెలిపారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని సేవలు సొంత గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయన్నారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారని తెలిపారు.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎంతమంది కలిసొచ్చినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయం. ఇందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ అన్నారు. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్‌ వెంకటేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అనిల్‌ బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అబద్ధపు మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా మాటలపై ఉండి సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలన్న ఆలోచన టీడీపీకి లేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ షేక్‌ సఫియా బేగం, నగరపాలక సంస్థఽ కో–ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ జమీర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు తదితరలు పాల్గొన్నారు.

నిధులు మంజూరు చేయాలని వినతి

నెల్లూరు(దర్గామిట్ట): ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ను బుధవారం నెల్లూరులోని క్యాంప్‌ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ హై లెవల్‌ కెనాల్‌ నిర్మాణంలో భాగంగా భూములిచ్చిన పడమటినాయుడుపల్లి గ్రామ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అదే విధంగా రిజర్వాయర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యశాలలో అదనపు సౌకర్యాల కల్పనకు ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా నిధుల మంజూరు విషయమై చొరవ చూపాలని కోరారు. సంగం మండలం అన్నారెడ్డిపాళెంలో ఇంటి స్థలాల మంజూరుకు స్థల సేకరణ త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆత్మకూరు మండలం కరటంపాడులో నూతనంగా మంజూరు చేసిన బీసీ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలకు అనుసంధానంగా ఎస్సీ వెల్ఫేర్‌ బిల్డింగ్‌ను మంజూరు చేయించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులున్నారు.

మరిన్ని వార్తలు