కాళ్లరిగేలా తిరిగినా కానరాని ప్రయోజనం | Sakshi
Sakshi News home page

కాళ్లరిగేలా తిరిగినా కానరాని ప్రయోజనం

Published Thu, Nov 16 2023 12:04 AM

-

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మండలంలోని గుడ్లూరువారిపాళెం, పుంజులూరుపాడు, ఎగువమిట్ట గ్రామాల రైతులు ఖుషీఖుషీగా ఉన్నారు. వాస్తవానికి ఈ గ్రామాల మధ్యలో 326 ఎకరాల విస్తీర్ణంలో కామినేని చెరువు ఉంది. దాదాపు 40 ఏళ్లుగా ఈ చెరువు భూములను ఈ గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో చెరువు భూములను సీజేఎఫ్‌ఎస్‌ భూములుగా మార్చారు. ఈ భూములకు ఆర్డీఓ పేరుతో పట్టాదారుడు.. అనుభవదారులుగా సంబంధిత రైతుల పేర్లను నమోదు చేశారు. అయితే సీజేఎఫ్‌ఎస్‌ భూములకు ప్రభుత్వ పథకాలు, ఇతర ఏ ప్రయోజనాలు చేకూరే అవకాశం లేకపోవడంతో అప్పటి నుంచి ఈ గ్రామాల రైతులు పాలకులు, అధికారుల చుట్టూ తిరిగారు.

కాళ్లరిగేలా తిరిగినా కానరాని ప్రయోజనం

గత ప్రభుత్వ హయాంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరిగారు. సీజేఎఫ్‌ఎస్‌ను రద్దు చేయించి ప్రభుత్వ భూములుగా మార్చి వదిలేశారు. ఈ విషయమై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవడంతో గుడ్లూరువారిపాళెం పంచాయతీ మొలకలపూడి వద్ద సభను నిర్వహించి డీకేటీ పట్టాలను ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఆ సమయంలో సోమిరెడ్డితో రైతులు వాగ్వాదానికి దిగగా, తప్పించుకొని వెళ్లిన ఉదంతాలూ ఉన్నాయి.

ప్రతిష్టాత్మకంగా.. పట్టువదలకుండా

గుడ్లూరువారిపాళెం, పుంజులూరుపాడు, ఎగువమిట్ట గ్రామాల సీజేఎఫ్‌ఎస్‌ భూములకు డీకేటీ పట్టాల మంజూరు అంశాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల విషయాన్ని కలెక్టర్‌తో చర్చించారు. ప్రభుత్వ భూములుగా ఉన్న వీటిని ఎవరైతే సాగు చేసుకుంటున్నారో సంబంధిత రైతుల పేర్లను అనుభవదారులుగా చేర్పించారు. దీంతో వీరికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.7500 రైతు భరోసా లబ్ధి చేకూరింది.

Advertisement
Advertisement