సింహపురికి చిరకాల మిత్రుడు

12 Nov, 2023 00:44 IST|Sakshi
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం అందుకుంటున్న చంద్రమోహన్‌ దంపతులు (ఫైల్‌)
అనుబంధం

నెల్లూరు(బృందావనం): తెలుగు వారి హృదయాల్లో చిరకా లం గుర్తుండిపోయే సినీనటుడు చంద్రమోహన్‌. సుమారు ఆరు దశాబ్దాలపాటు విభిన్న పాత్రలు పోషించి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. విలక్షణ నటుడిగా కీర్తికిరీటాలు అందుకుని ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఆయనకు సింహపురితో దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన శనివారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారని తెలియగానే చంద్రమోహన్‌తో ఉన్న అనుబంధాన్ని సింహపురీయులు గుర్తుచేసుకున్నారు.

‘చిన్నారి స్నేహం’ సినిమాతో..

చైన్నెలో నివాసం ఉంటున్న సమయంలో నెల్లూరులో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో చంద్రమోహన్‌ పాల్గొన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం ‘చిన్నారి స్నేహం’ సినిమాలో హీరోగా షూటింగ్‌లో పాల్గొనేందుకు నెల్లూరుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్‌ నెల్లూరు నగరం, పరిసరాల్లో దాదాపు 70 రోజులపాటు జరిగింది. అన్ని రోజులు నెల్లూరులో ఆయన బస చేశారు.

సినీరంగానికి తీరనిలోటు

నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద ఉన్న 25 కళాసంఘాల చాంబర్‌లో 25 కళాసంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం చంద్రమోహన్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మరణం సినీరంగానికి తీరనిలోటుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో 25 కళాసంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, అమీర్‌జాన్‌, నేదురుమల్లి హరనాథ్‌రెడ్డి, భాస్కర్‌, సింహపురి మూవీ అసోసియేషన్‌ ప్రతినిధులు రెమో, శివలంకి జనార్దన్‌, మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే చంద్రమోహన్‌, జలంధర దంపతులతో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ కవి, రచయిత ఈతకోట సుబ్బారావు వివరించారు. బుల్లితెర నటుడు శింగంశెట్టి మురళీమోహన్‌రావు మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాల క్రితం మద్రాస్‌ ప్రసాద్‌ స్టూడియోలో దొంగరాముడు షూటింగ్‌లో తొలిసారిగా చంద్రమోహన్‌ పరిచయమయ్యారని తెలిపారు. నాటి నుంచి నెల్లూరుకు విచ్చేసిన ప్రతిసారీ ఆయనను కలిసే వాడినని తెలిపారు.

నెల్లూరుతో చంద్రమోహన్‌కు

ఎనలేని అనుబంధం

నెల్లూరు నగరంలోని పురమందిరంలో 2014వ సంవత్సరంలో అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన 25 కళాసంఘాల వార్షికోత్సవానికి చంద్రమోహన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

2011లో బాలాజీనగర్‌లోని విశాలాక్షి వృద్ధాశ్రమాన్ని ఆశ్రమ నిర్వాహకుడు కోసూరు రత్నం ఆహ్వానం మేరకు చంద్రమోహన్‌ నెల్లూరుకు వచ్చి ప్రారంభించారు.

నెల్లూరు పురమందిరంలో 2019 జూన్‌ 4న శ్రీవిజేత ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేతులమీదుగా చంద్రమోహన్‌ – జలంధర దంపతులు రూ.లక్ష నగదుతోపాటు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ జాతీయ పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని చంద్రమోహన్‌ నిండుసభలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌ నటించిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలోని ‘రా.. దిగిరా.. దివి నుంచి భువికి దిగిరా..’ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.

నెల్లూరులో 2020 ఫిబ్రవరి 26న శ్రీకస్తూరీదేవి గార్డెన్స్‌లో జరిగిన ప్రముఖ సంగీత దర్శకుడు వాసూరావు కుమారుడి వివాహానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి చంద్రమోహన్‌ హాజరయ్యారు.

నెల్లూరంటే ఎంతో ఇష్టం

హైదరాబాద్‌లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం సినీ నటుడు నూతన ప్రసాద్‌ తదితరులతో ఉన్న సమయంలో తరచూ చంద్రమోహన్‌ ఇంటికి వెళ్లేవాడిని. ఆయన మావంటి వారికి ఎంతో స్ఫూర్తి. ఆయనకు నెల్లూరన్నా.. నెల్లూరు భోజనమన్నా ఎంతో ఇష్టం.

– దోర్నాల హరిబాబు, హాస్యనటుడు

మరిన్ని వార్తలు