అవని...ఆకాశం..ఆమె!

8 Mar, 2023 01:36 IST|Sakshi
పంటకు నీరు పెడుతున్న మహిళా రైతు సరస్వతి

ఇంటా...బయటా...అన్నింటా ఆమె. ఇల్లు, పొలం, కార్యాలయం ఎక్కడైనా ఆమే. కుటుంబాలకు తోడు...సమాజ వికాసానికి చేదోడు. ఆకాశంలో సగం.. అంతులేని సహనం.. అమితమైన నేర్పరితనం.. ఆలిలా..అమ్మలా..అత్తమ్మలా..తోబుట్టువులా..ఇలా..లాలిస్తూ, పాలిస్తూ, అడుగడుగునా తోడైంది. అన్నింటా ‘రాణి’స్తూ.. స్వ‘శక్తి’గా ఎదుగుతోంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న జిల్లా మహిళామణుల జీవనయానంపై ప్రత్యేక కథనం..

సాగులో రాణిస్తున్న గంగమ్మ

అమరాపురం: మండలంలోని మద్దనకుంట గ్రామానికి చెందిన గంగమ్మ భర్త 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికి ఆమె కుమారుడు బాలచంద్రకు రెండేళ్లు. ఐదెకరాల పొలం ఉన్నా సాగు చేసే వారు లేరు. దీంతో గంగమ్మ పొలంలో దిగింది. కష్టమైనా చెమటోడ్చింది. మెట్ట భూముల్లో మామిడి, చింత సాగు చేసింది. అంతర పంటగా వేరుశనగ సాగుచేస్తూ స్వశక్తితో ఎదిగింది. ఎవరిపై ఆధారపడకుండా బతుకుతోంది.

తోడు దూరమైనా..

పట్టువదలని నాగజ్యోతి

పుట్టపర్తి: చిన్న వయస్సులోనే భర్త దూరమైనా.. ఆమె పట్టు వదల్లేదు. తల్లిదండ్రులు, కుమారుడి ప్రోత్సాహంతో డిప్యూటి కలెక్టర్‌ ఉద్యోగం సాధించింది. ఆమె బుక్కపట్నానికి చెందిన పిచ్చల నాగజ్యోతి. భర్త వెంకటరెడ్డి 2013వ సంవత్సరంలో మృతి చెందగా... అప్పటికే ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్న నాగజ్యోతి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమైంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని దీక్షతో చదివింది. 2022 జూలైలో గ్రూప్‌–1 విజేతగా నిలిచి డిప్యూటీ కలెక్టర్‌ఉద్యోగం సాధించింది.

సోడాల బండితో చేదోడు

హిందూపురం ధరంపురానికి చెందిన బీబీబేగం కష్టానికి నిలువెత్తు నిదర్శనం. భర్త సంపాదనతో కుటుంబం గడవదని తెలుసుకున్న బీబీబేగం తనవంతు సాయంగా నిలిచింది. తోపుడు బండిపై సోడా, కూల్‌డ్రింక్స్‌ దుకాణం ఏర్పాటు చేసుకుంది. రోజూ ఏడీబీ బ్యాంకు పక్కనే ఎర్రటి ఎండలో నిలబడి వ్యాపారం చేస్తోంది. వేసవిలో ప్రజలకు చల్లని సోడా, నన్నారి, నిమ్మసోడాలు అందిస్తూ నాలుగు రాళ్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్కగానొక్క కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతుండగా...భవిష్యత్‌లో బిడ్డను ఉన్నతవిద్యావంతుడిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతోంది.

ఎందరికో ఆదర్శం సరస్వతి

అగళి మండలం మధూడి గ్రామానికి చెందిన సరస్వతికి మొదటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ. అందువల్లే రోజూ భర్తతో పాటు పొలం వెళ్లి సాగులో సాయంగా నిలిచేది. ఎనిదేళ్ల క్రితం భర్త మృత్యువాత పడగా...ఇద్దరు పిల్లల పోషణ, కుటుంబ పోషణ భారం సరస్వతి మీద పడింది. దీంతో సరస్వతి... సాగుకు సిద్ధమైంది. ఎవరిసాయం లేకుండానే పొలం పనులన్నీ చేసుకునేది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు ప్రకృతి వ్యవసాయం చేసింది. అధిక దిగుబడులు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం సరస్వతి కుమార్తె అరుణ్య బీటెక్‌, కుమారుడు నిఖిల్‌ ఇంటర్‌ చదువుతున్నారు.

మానస

సంకల్పానికి తోడు..‘సాగు’లో చేదోడు

వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు

ఆదర్శవంతమైన జీవితాలతో ఎందరికో స్ఫూర్తి

నాట్య మయూరి మానస

ధర్మవరం: ఆమె పాదం కదిపితే నటరాజు నాట్యమాడినట్లు ఉంటుంది. ఆమె నాట్య విన్యాసాలకు అవార్డులెన్నో వచ్చిచేరాయి. నాట్యంలో రాణిస్తూనే సమాజ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది ధర్మవరానికి చెందిన నృత్య కళాకారిణి మానస.

రాష్ట్ర స్థాయి నంది పురస్కారం

ధర్మవరం పట్టణంలోని పీఆర్‌టీ వీధికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త తులసీ, చిరుద్యోగి కృష్ణ దంపతులకుమార్తె మానస. ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. చిన్ననాటి నుంచే నాట్యంలో శిక్షణ పొందిన మానస రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిచ్చి ఆహూతులను ఆకట్టుకుంది. 2021లో అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి నృత్య ప్రదర్శనలో తన అద్భుత నాట్య విన్యాసాలతో నంది అవార్డును సొంతం చేసుకుంది. తమిళనాడులో జరిగిన వడయార్‌ నృత్య ప్రదర్శనలోనూ పాల్గొంది. దాదాపు 102 మంది కళాకారులు చేసిన ఈ నృత్య ప్రదర్శన గిన్నీస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది. తనలోని ప్రతిభను అందరికి పంచాలన్న ఉద్దేశంతో మానస పేద విద్యార్థులకు ఉచితంగా నాట్యం నేర్పుతోంది. మరోవైపు ఆపదలో ఉన్న పేదలకు సాయం అందించేందుకు డ్యాన్స్‌ అండ్‌ కల్చరల్‌ సంఘం అనే ఓ ట్రస్ట్‌ను నెలకొల్పిన మానస...తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు