పల్లె వాకిట్లో పాల పొంగు | Sakshi
Sakshi News home page

పల్లె వాకిట్లో పాల పొంగు

Published Sat, Nov 11 2023 1:18 AM

- - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలో పాల దిగుబడి పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మేలు జాతి పశువుల వీర్యంతో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించి పెయ్య దూడల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రీయ గోకుల మిషన్‌ సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఇప్పటికే పలువురు రైతుల ఇంట పెయ్య దూడలు జన్మించడం విశేషం.

తప్పిన వ్యయ ప్రయాసలు..

గతంలో మేలు జాతి పశువుల కోసం రైతులు ఇతర రాష్ట్రాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లేవారు. కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకొచ్చేవారు. ఆ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతూ స్థానిక పశువైద్య శాలల్లోనే మేలు జాతి పశువుల వీర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని 23 పశువైద్య శాలల్లో వీటిని సిద్ధంగా ఉంచారు. రైతులకు అవసరమైతే వెంటనే గ్రామాలకు సరఫరా చేసి కృత్రిమ గర్భధారణ చేయిస్తారు.

రైతులకు రాయితీపై..

సాధారణంగా ఒక్కో పశువుకు కృత్రిమ గర్భధారణకు రూ.1,350 ఖర్చవుతుంది. అయితే రూ.850ను సబ్సిడీగా తానే భరిస్తూ రైతు కేవలం రూ.500 చెల్లిస్తే చాలు వీర్య నాళికలను రెండు డోసులుగా పశువులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో కేవలం పెయ్య దూడలే పుడతాయని పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఒక డోసు విఫలమై గర్భం దాల్చకుంటే, రెండో డోసు ఉచితంగా అందజేస్తారు.

గ్రామాల్లో అవగాహన..

ఈ వీర్య సాంకేతిక పద్ధతిపై ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పాల దిగుబడి ఎక్కువగా ఉండే రకాలైన ముర్రా, గిర్‌, జెర్సీ, హెచ్‌ఎఫ్‌ జెర్సీ, సాహివాల్‌ తదితర మేలు జాతి పశువుల వీర్యాన్ని అందుబాటులోకి తేవడం గమనార్హం. అవసరమైన రైతులు స్థానిక గ్రామ/ వార్డు సచివాలయాల్లోని వెటర్నరీ అసిస్టెంట్లను సంప్రదించాలి.

పాల దిగుబడి పెంపునకు

ప్రభుత్వం చర్యలు

పశువుల కృత్రిమ గర్భధారణకు శ్రీకారం

అందుబాటులో మేలు జాతి

పశువుల వీర్యం

రైతులకు సబ్సిడీపై అందజేత

99 శాతం పెయ్యదూడలే

పుడతాయంటున్న అధికారులు

అవగాహన కల్పిస్తున్నాం

కృత్రిమ గర్భధారణపై పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే 2,300 పశువులకు వీర్యం అందించాం. అన్నీ పెయ్య దూడలే పుట్టాయి. సాధారణంగా కృత్రిమ గర్భధారణకు ఒక్కో పశువుకు రూ.1,350 ఖర్చు అవుతుంది. రైతు వాటాగా కేవలం రూ.500 చెల్లిస్తే, ప్రభుత్వం రూ.850 సబ్సిడీ భరిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి.

– శుభదాస్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

చాలా మంచి కార్యక్రమం

సుమారు 12 ఏళ్ల నుండి పాడి పశువుల పెంపకంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పెయ్య దూడ పుడితే మహాలక్ష్మీ పుట్టినట్టేనని భావిస్తాను. గతంలో మేలు జాతి పశువుల కోసం ఇతర రాష్ట్రాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లేవాళ్లం. అలాంటి బాధలు తప్పిస్తూ పాడి రైతుల కోసం మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టడం ప్రశంసనీయం.

– సుధాకర్‌, పాడి రైతు, ప్రశాంతిగ్రామం

రుణపడి ఉంటాం

పాడి రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ‘జగనన్న పాలవెల్లువ’ ద్వారా ఇప్పటికే గిట్టుబాటు ధరలు కల్పించింది. గ్రామాల్లోని ఆర్‌బీకేల్లోనే పశు వైద్యం మందులు అందుతున్నాయి. ఈ పథకం ద్వారా పెయ్య దూడలు పుడితే చాలా ఆనందం. అన్ని వర్గాల కోసం పథకాలు తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.

– లక్ష్మీపతి, సుబ్బరాయనిపల్లి

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement

తప్పక చదవండి

Advertisement