ఘనంగా విష్ణు సహస్రనామ పారాయణం | Sakshi
Sakshi News home page

ఘనంగా విష్ణు సహస్రనామ పారాయణం

Published Sat, Nov 11 2023 1:18 AM

స్వామి చిత్ర పటాలు అందిస్తున్న చైర్మన్‌ గోపాలకృష్ణ, ఈఓ శ్రీనివాసరెడ్డి - Sakshi

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధర్మ ప్రచార వారోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శుక్రవారంరాత్రి విష్ణు సహస్రనామ పారాయణం ఆచరించారు. శ్రీనారప్ప స్వామి నందిమఠం గోరంట్ల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, నరసింహస్వామి చరిత్ర, భరతనాట్యం, భక్తిగీతాలు ఆలపించారు. ఆలయ చైర్మన్‌ గోపాలకృష్ణ, ఈఓ శ్రీనివాసరెడ్డి ప్రశంసాపత్రాలు, స్వామి చిత్రపటాలు అందించారు.

ముగ్గురు గొర్రెల దొంగల అరెస్టు

బత్తలపల్లి: వ్యసనాలకు బానిసై గొర్రెల అపహరణకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పి.శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్లకు వివరాలు వెల్లడించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఈదుల ముష్టూరు, విశ్వనాథపురంలో గొర్రెలు అపహరణకు గురైనట్లు కేసులు నమోదయ్యాయి. వీటిపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ ఆరోహణరావు నేతృత్వంలో సిబ్బంది విచారణ చేపట్టారు. అందులో భాగంగా ధర్మవరం మండలం ఏలుకుంట్లకు చెందిన దాసరి లక్ష్మన్న, దాసరి రాము, ధర్మవరం టౌన్‌ కేతిరెడ్డి కాలనీకి చెందిన లోచర్ల బాలకృష్ణ నిందితులుగా నిర్ధారణ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం లింగారెడ్డిపల్లి క్రాస్‌ వద్ద నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 31 పొట్టేళ్లు విక్రయించగా వచ్చిన నగదు రూ.1,50,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పట్టుకున్న ఏఎస్‌ఐ సోమశేఖర్‌మూర్తి, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీరాములు, కానిస్టేబుళ్లు సుదర్శన్‌, పెద్దారెడ్డి, జనార్దన్‌, ఆంజనేయులును అభినందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎస్కేయూ వీసీ నియామకానికి సెర్చ్‌ కమిటీ

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఈ నెల 23తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన వీసీ నియామకం కోసం సెర్చ్‌ కమిటీని రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావును నియమించారు. సెర్చ్‌ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ ముగ్గురు మూడు పేర్లను ప్రతిపాదిస్తారు. ఇందులో ఒకరిని వీసీగా చాన్సలర్‌/ గవర్నర్‌ నియామకం చేస్తారు. సెర్చ్‌ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా ప్రొఫెసర్‌ డి.జమున (మాజీ వీసీ, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, తిరుపతి), యూనివర్సిటీ పాలకమండలి నామినీగా ప్రొఫెసర్‌ డీఎన్‌ రెడ్డి (మాజీ వీసీ, జేఎన్‌టీయూ, హైదరాబాద్‌, తెలంగాణ), యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నామినీగా ప్రొఫెసర్‌ సారిత్‌ కుమార్‌ దాస్‌ (వి.బాలకృష్ణన్‌ చైర్‌ ప్రొఫెసర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మద్రాస్‌ ఐఐటీ)లను నియమించారు. త్వరలోనే సెర్చ్‌ కమిటీ సమావేశమై దరఖాస్తులన్నింటినీ పరిశీలించి మూడు పేర్లను ప్రతిపాదించనుంది.

Advertisement
Advertisement