జాగ్రత్తలతో ఆనంద దీపావళి | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలతో ఆనంద దీపావళి

Published Sat, Nov 11 2023 1:18 AM

పుట్టపర్తిలో ఏర్పాటైన బాణాసంచా దుకాణాలు - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: వెలుగుల పండుగ దీపావళిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక.. దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు. అయితే క్రాకర్స్‌ కాల్చే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగరోజు టపాసులు కాల్చే విషయంలో అజాగ్రత్తగా ఉండి ఎంతో మంది గాయాలపాలైన సందర్భాలున్నాయి. ఒక్కోసారి దీపావళి టపాసుల వల్ల కళ్లు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అందుకే దీపావళికి బాణాసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకొని, సేఫ్‌ దీపావళి జరుపుకోవాలని సూచిస్తున్నారు.

వ్యాపారస్తులకు అనుమతులు..

జిల్లాలో బాణాసంచా వ్యాపారానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు అనుమతులను కూడా మంజూరు చేశారు. ఇప్పటి వరకూ 223 మంది వ్యాపారులు అనుమతులు పొంది బాణాసంచా దుకాణాలు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పట్టణ సమీపంలోని ఆటస్థలాలు, ఖాళీ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు.

కదిరిలోనే అత్యధికం..

దీపావళి రోజు టాపాసులు అమ్మడానికి జిల్లాలోని పలు పట్టణాలు, మండలాలకు సంబంధించి 223 షాపులు ఏర్పాటుకు అనుమతించారు. ఇందులో అత్యధికంగా కదిరి లోని బాయ్స్‌ కాలేజీగ్రౌండులో 44 షాపులు, హిందూపురం ఎంజీఎం స్కూల్‌ గ్రౌండులో 43, ధర్మవరం కాలేజీ గ్రౌండులో 19 , గోరంట్లలోని ఎస్‌ఏపీఎస్‌ కళాశాల ఎదురుగా ఉన్న గ్రౌండులో 18, కొత్తచెరువు మార్కెట్‌ యార్డులో 12, పుట్టపర్తి సమీపంలోని చిత్రవతి నది పక్కన 11, చిలమత్తూరులో 6, పెనుకొండ జూనియర్‌ కళాశాల గ్రౌండులో 7, ఓడీసీ వశిష్ట స్కూల్‌ గ్రౌండులో 8, సోమందేపల్లిలో 7, తనకల్లులో 6, ముదిగుబ్బ, నల్లమాడలో 5 చొప్పున మొత్తం 28 మండల కేంద్రాలకు దుకాణాల ఏర్పాటుకు అనుమతించారు. రోడ్లపై బాణాసంచా విక్రయాలు జరగకుండా చూడాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనలు పాటించాలి..

బాణాసంచా దుకాణాలు ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. జనావాసాలకు దూరంగా ఉన్న చిన్న భవనంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదవశాత్తూ మంటలు చలరేగితే నియంత్రించే ఏర్పాట్లు చేసుకోవాలి.

టపాసులు కాల్చే వారు...

టపాసులు కాల్చాలనుకునే వారందరూ అనుమతి పొందిన దుకాణాల నుంచి మాత్రమే బాణాసంచా కొనుగోలు చేయాలి. అగ్ని ప్రమాదాలు జరగని ప్రదేశాల్లో వీటిని భద్రపరచాలి. బాణాసంచా కాల్చే సమయంలో ప్యాకెట్‌పై ఉన్న నిబంధనలు పాటించాలి. ఖాళ్లీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి. బాణాసంచా కాల్చే సమయంలో నీటిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. కాల్చేవారు కాటన్‌ దుస్తులు ధరించాలి. లూజు దుస్తులను ధరించకూడదు. కచ్చితంగా చెప్పులు ధరించాలి. రద్దీ ప్రదేశాల్లో పెద్ద పెద్ద టపాసులు కాల్చరాదు పెద్దల పర్యవేక్షణలోనే చిన్న పిల్లలు బాణా సంచా కాల్చాలి. బాంబులు వంటివి చేతితో పట్టుకొని కాల్చకూడదు.

ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు

జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను జరుపుకోవాలి. ఎవరూ ప్రమాదాలనుకొని తెచ్చుకోకూడదు. చిన్న పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దగ్గరుండి వారితో టపాసులు కాల్పించాలి. షాపులు ఏర్పాటు విషయంలో కఠిన నిబంధనలు విధించాము. ప్రజలే కాకుండా షాపుల యజమానులు తగిన జాగ్రత్తలు పాటించాలి.

– అరుణ్‌బాబు, కలెక్టర్‌

టపాసుల విక్రయాలు షురూ

బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

జిల్లాలో 223 దుకాణాల ఏర్పాటు

నిబంధనలు పాటించాలంటున్న

అధికారులు

1/2

2/2

Advertisement
Advertisement