వివాదంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే.. పంచాయితీ సెక్రటరీకి బెదిరింపులు

6 Jun, 2023 15:12 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలోని బోథ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఓ విషయంలో ఇచ్చోడ మండలం నవ్‌గామ్‌ పంచాయితీ సెక్రటరీకి ఫోన్‌ చేసి ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు హెచ్చరించారు. పంచాయితీ సెక్రటరీ సురేష్‌కు ఫోన్‌ చేసి భార్యా, పిల్లలను బతికించుకుంటావా లేదా చెప్పాలంటూ బెదిరింపులకు గురిచేశారు. ఉద్యోగం పోతే తెలుస్తుందని, మంచి మాటతో చెప్తున్నా.. పద్దతి మార్చుకోవాలని భయపెట్టారు.

ఎక్కువ మాట్లాడుతున్నావని, సర్పంచ్‌లతో కలిసి తప్పులు చేస్తున్నావని సెక్రటరినీ భయబ్రాంతులకు గురిచేశారు. అయితే తన తప్పేంటో చెప్పాలని ఎమ్మెల్యేను సెక్రటరీ ప్రాదేయపడ్డారు. తప్పుంటే రాజీనామా చేస్తానని తెలిపారు. అయినా సెక్రటరీ మాటలు పట్టించుకోని ఎమ్మెల్యే.. పద్దతి మారకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. 

కాగా ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్‌ పాల సంస్థ భాగస్వామి శేజల్‌ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని వాపోయారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.

శేజల్‌ను పరామర్శించిన మాజీ మంత్రి గడ్డం వినోద్
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్‌ను మాజీ మంత్రి గడ్డం వినోద్ పరామర్శించారు.  ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పెద్దలు మాణిక్యం థాక్రేను కలిసేందుకు ఢిల్లీకి వచ్చాను. మానవత్వంతో శేజల్‌ను  పరామర్శించాను. బెల్లంపల్లిలో ఇంత  పెద్ద దుర్ఘటన జరగడం బాధాకరం. 

నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు ఆమె ఇచ్చిన ఫిర్యాదును అధికారులు పట్టించుకోవడం లేదు,  FIR కూడా చెయ్యడం లేదు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై  చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పైన వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలి. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వ భూమి ఇచ్చారు.  30 లక్షలు తీసుకొని ఒక ఏడాది గడిచిపోయింది  న్యాయం కావాలని శేజల్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం.

చదవండి: తెలంగాణకు అమిత్‌ షా, జేపీ నడ్డా.. ఎప్పుడంటే!

మరిన్ని వార్తలు