Video: దుర్గంచెరువు వద్ద డ్రోన్‌ షో.. ఆకాశంలో అద్భుతం 

5 Jun, 2023 04:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో చేపట్టిన ప్రగతిపై ఆకాశంలో డ్రోన్లతో ప్రదర్శన కనువిందు చేసింది. మాదాపూర్‌లోని దుర్గంచెరువు వద్ద సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. పదిహేను నిమిషాల పాటు డ్రోన్లతో దుర్గంచెరువుపై ఆకాశంలో ఈ ప్రదర్శన సాగింది. 2014–2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అమరదీపం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, సీఎం కేసీఆర్‌ చిత్రాలతో కూడిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు దేశంలోనే శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసుల ప్రతిభను కూడా ప్రదర్శించారు.

ఇటీవల ప్రారంభించిన సచివాలయం, యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు, దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌ టీ హబ్, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా, రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుకున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ టవర్స్, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ ప్రగతిని డ్రోన్ల ద్వారా చిత్రాలతో కూడిన ప్రదర్శన కూడా విశేషంగా ఆలరించింది. ప్రదర్శన ముగిసే వరకు సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.

అందరూ ఆసక్తిగా ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ప్రదర్శనను మంత్రులు మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్‌రావులు, సైబరాబాద్‌ పోలీసు అధికారులు, సిబ్బంది ఆసక్తిగా తిలకించారు. 
చదవండి: సీఎం ఆదేశిస్తే డోర్నకల్‌ నుంచి పోటీ చేస్తా: మంత్రి సత్యవతి రాథోడ్‌ 

మరిన్ని వార్తలు