మరో 2,043 మందికి కరోనా

19 Sep, 2020 04:17 IST|Sakshi

రాష్ట్రంలో ఇప్పటివరకు 23.79 లక్షల పరీక్షలు.. 1.67 లక్షల కేసులు 

కోలుకున్నవారు 1.35 లక్షలు.. మరణాలు 1,016 

వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం 50,634 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,043 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తం 23,79,950 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 1,67,046 కేసులు నమోదయ్యా యి. ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,016కి చేరింది. కరోనా బారి నుంచి గురువారం ఒక్క రోజే 1,802 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,35,357కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,081 మంది హోం లేదా వివిధ సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.

ఇక రాష్ట్రంలో ప్రతీ 10 లక్షల మంది జనాభాకు 64,104 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 1,16,932 (70%) మంది లక్షణా లు లేకుండా కరోనా బారినపడ్డారని వెల్లడించారు. అలాగే మిగిలిన 50,114 (30%) మంది కరోనా లక్షణాలతో వైరస్‌ బారినపడ్డారని వివరించారు. రాష్ట్రంలో 86 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఉండగా.. వాటిల్లో 8,040 పడకలున్నాయి. ఇదిలావుంటే ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 314, రంగారెడ్డి జిల్లాలో 174, మేడ్చల్‌ 144, నల్లగొండ 131, సిద్దిపేటలో 121, కరీంనగర్‌లో 114, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 108 నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు