మునుగోడు దంగల్‌: బరిలో 47 మంది.. 33 మంది స్వతంత్రులు.. 26 మంది ఇతర జిల్లాల వాళ్లే!

18 Oct, 2022 01:14 IST|Sakshi

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం..

ప్రధాన పార్టీల నుంచి నలుగురు బరిలో..

రిజిస్టర్డ్‌ పార్టీల నుంచి పది మంది.. 

33 మంది ఇండిపెండెంట్లు పోటీలో

ఒక్కో పోలింగ్‌ బూత్‌లో మూడు చొప్పున ఈవీఎంలు

నామినేషన్లు, బరిలో ఉన్నవారి వివరాలివీ..

మొత్తంగా నామినేషన్లు వేసినవారు: 130 మంది

అధికారుల తిరస్కరణకు గురైనవారు: 47 మంది

ఉపసంహరించుకున్నవారు: 36 మంది

చివరికి బరిలో ఉన్నవారు: 47 మంది

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగిసింది. మొత్తంగా పోటీలో 47 మంది మిగిలారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులూ పోటీలో నిలిచారు. ఉప ఎన్నికకు ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించగా.. మొత్తం 130 మంది దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు స్క్రుటినీలో 47 మంది నామినేషన్లను తిరస్కరించి, 83 మంది పత్రాలను ఆమోదించారు. ఇందులో సోమవారం 36 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 47 మంది బరిలో ఉన్నారు.

మంత్రుల హామీతో తప్పుకున్న కొందరు
మునుగోడు నియోజకవర్గంలోని ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయినవారు, ఇతర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, వీఆర్‌ఏలు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసినవారితో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపి ఉపసంహరణకు ఒప్పించారు.

26 మంది ఇతర జిల్లాల వారే..
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మిగిలిన స్వతంత్రుల్లో ఇతర జిల్లాల వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తం 33 మంది స్వతంత్రులు పోటీలో ఉంటే.. అందులో 26 మంది ఇతర జిల్లాలకు చెందిన వారే. మొత్తంగా నల్లగొండకు చెందిన ఏడుగురు, హైదరాబాద్‌ 5, రంగారెడ్డి 4, కరీంనగర్‌ 3, మేడ్చల్‌ మల్కాజిగిరి 3, యాదాద్రి 3, ములుగు 3, సూర్యాపేట 2, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్‌ల నుంచి ఒక్కొక్కరు పోటీలో ఉన్నారు.

గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (బీజేపీ), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), పాల్వాయి స్రవంతి (కాంగ్రెస్‌), ఆందోజు శంకరాచారి (బీఎస్పీ).

రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు
కొలిశెట్టి శివకుమార్‌ (యుగ తులసి పార్టీ), లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ), నందిపాటి జానయ్య (తెలంగాణ సకల జనుల పార్టీ), పల్లె వినయ్‌కుమార్‌ (తెలంగాణ జన సమితి), కంభంపాటి సత్యనారాయణ (నేషనల్‌ నవ క్రాంతి పార్టీ), మారమోని శ్రీశైలం యాదవ్‌ (సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి), పాల్వాయి వేణు (సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), బత్తుల దిలీప్‌ (ప్రజా ఏక్తా), ప్రతాప్‌ సింహరాయుడు (తెలంగాణ జాగీర్‌ పార్టీ), యాదీశ్వర్‌ నక్క (తెలంగాణ రిపబ్లికన్‌ పార్టీ).

ఒక్కో పోలింగ్‌ బూత్‌లో మూడు ఈవీఎంలు
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో 47 మంది బరిలో ఉండటంతో పెద్ద సంఖ్యలో ఈవీఎంలు అవసరం పడనున్నాయి. సాధారణంగా ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లతోపాటు నోటా బటన్‌ ఒకటి ఉంటుంది. ఈ లెక్కన మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి పోలింగ్‌ బూత్‌లో మూడు చొప్పున ఈవీఎంలు అవసరం పడనున్నాయి. ఓటర్లు మూడు ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లను వెతుక్కుని ఓటు వేయాల్సి ఉంటుంది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీగా అభ్యర్థులు.. మూడోసారి
మునుగోడు ఉప ఎన్నికలో 47 మంది బరిలో మిగలడంతో.. రాష్ట్రంలో ఎక్కువ మంది అభ్యర్థులతో జరుగుతున్న మూడో ఎన్నికగా నిలవనుంది. ఇంతకుముందు 1996లో మొదటిసారిగా నల్లగొండ లోక్‌సభ ఎన్నికల్లో 480 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో 444 మంది నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యపై జల సాధన సమితి నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో నామినేషన్లు వేయడం గమనార్హం.

బ్యాలెట్‌ పత్రాన్ని పెద్ద బుక్‌లెట్‌లా ముద్రించాల్సి వచ్చింది. దీనితో నల్లగొండ ఫ్లోరైడ్‌ సమస్యపై జాతీయస్థాయిలో దృష్టి పడింది. ఇక 2019లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో పెద్ద సంఖ్యలో పసుపు రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికలో 185 మంది పోటీపడటం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. తాజాగా మునుగోడులో వివిధ డిమాండ్లతో నామినేషన్లు దాఖలుకాగా.. 47 మంది బరిలో నిలిచారు.  

మరిన్ని వార్తలు