హైదరాబాద్‌ వేదికగా.. 75 కోట్ల సూర్య నమస్కారాలు!

2 Jan, 2022 07:44 IST|Sakshi

హైదరాబాద్‌ వేదికగా రేపు ప్రారంభం

హాజరవనున్న రామ్‌దేవ్‌ బాబా, కేంద్ర మంత్రి సోనోవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా సరికొత్తగా 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్‌ జరగబోతోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జరిగే ఈ ఆన్‌లైన్‌ చాలెంజ్‌కు హైదరాబాద్‌ వేదిక కాబోతోంది. నందిగామ మండలంలోని కన్హా విలేజ్‌లో ఉన్న కన్హా శాంతి వనంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 3న మొదలై ఫిబ్రవరి 20 వరకు కార్యక్రమం కొనసాగనుంది.

హార్ట్‌ ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్, ఫిట్‌ ఇండియా, పతంజలి ఫౌండేషన్‌ తదితర జాతీయ స్థాయి సంస్థలు కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో దీన్ని చేపట్టాయి. రామ్‌దేవ్‌ బాబాతో పాటు కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగానే అథెంటిక్‌ యోగా బుక్‌ ఆవిష్కరణ, హార్ట్‌ ఫుల్‌ నెస్‌ ఇంటర్నేషనల్‌ యోగా అకాడమీకి శంకుస్థాపన కూడా జరగనుంది. 
చదవండి: పెరిగిన చలి, కొత్త ఏడాది ఊపు.. మందు, బీర్లు తెగ లాగించేశారు..

21 రోజులు.. రోజుకు 13 సర్కిల్స్‌ 
చాలెంజ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా సాధకులు క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. నిర్ణీత గడువులోగా ప్రతి ఒక్కరూ 12 సూర్య నమస్కారాల సర్కిల్‌ను రోజుకు 13 సార్లు చొప్పున సాధన చేస్తారు. ఫిబ్రవరి 20లోపు వీలును బట్టి 21 రోజుల్లో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసిన వారికి నిర్వాహకులు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.  

30 లక్షల మంది విద్యార్థులు పాల్గొనేలా.. 
హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వెయ్యికి పైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకు పైగా కళాశాలలు ఈ 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్‌లో పాల్గొననున్నాయి. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాల్గొనేలా చేసేందుకు కృషి జరుగుతోంది.
చదవండి: సర్కారు తప్పిదాలతోనే విద్యుత్‌ మోత!      

మరిన్ని వార్తలు