ఇక ఈజీగా ఆధార్‌ అప్‌డేట్‌

13 Dec, 2022 08:26 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మీరు ఆధార్‌ నమోదు చేసుకొని పదేళ్లు దాటిందా? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మార్పులతో అప్‌డేట్‌ చేసుకోలేదా? అయితే తప్పనిసరి కాకున్నా.. సులభతర గుర్తింపు కోసం ‘మై ఆధార్‌ పోర్టల్, మై ఆధార్‌ యాప్‌’ లేదా దగ్గరలోని ఆధార్‌ నమోదు కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను సమరి్పంచి, వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచిస్తోంది. తాజాగా ఆధార్‌ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్‌ సంఖ్య కలిగి ఉన్నవారు నమోదు తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను కనీసం ఒక్కసారైనా అప్‌డేట్‌ చేసుకోవాలని పేర్కొంది. 

అథంటికేషన్‌ కోసమే..  
ఆధార్‌ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభతరంగా పనులు పూర్తి చేసుకునేందుకు అప్‌డేషన్‌ తప్ప నిసరిగా తయారైంది. పేరు, ఇంటిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీ, రిలేషన్‌షిప్‌ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫొటో వంటి వివరాలను ఏమైనా మార్పులు చేయాల్సివచ్చినప్పుడు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. వయసు, అనారోగ్యం, ప్రమాదం వంటి కారణాలతో మార్పులు రావచ్చు. ఇందుకోసం తమ బయోమెట్రిక్‌ డేటాను 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్‌ చేయడం మంచిదని యూఐడీఏ సూచిస్తోంది. 

22.49 శాతం అప్‌డేషన్‌ తప్పనిసరిగా.. 
దేశంలోనే ఆధార్‌ నమోదులో అగ్రగామిగా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ 22.49 శాతం అప్‌డేషన్‌ తప్పనిసరిగా తయారైంది. మొత్తం ఆధార్‌ కార్డులు కలిగి ఉన్నవారిలో 0 నుంచి ఐదేళ్లలోపు 2.99 శాతం, ఐదు నుంచి 18 ఏళ్లు దాటిన వారు 19.5 శాతం ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఆధార్‌ నమోదు సంఖ్య 1.25 కోట్లకు చేరింది. అందులో ఐదు నుంచి 15 ఏళ్ల వయసు దాటిన వారికి, ఐదేళ్లలోపు ఆధార్‌ నమోదు చేసుకున్న వారికి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పని సరిగా మారింది.
  
స్వయంగా అప్‌డేట్‌ ఇలా.. 
ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు, ఎవరి సాయం అవసరం లేకుండా ఇంటర్నెట్‌లో..  https://ssup.uidai.gov.in/web/guest/ssup-home  నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఆధార్‌ సంఖ్యను, నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌ ఉపయోగించి ఈ పోర్టల్‌లో లాగిన్‌ కావచ్చు. వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ మొబైల్‌ ఫోనుకు వస్తుంది. దాని సాయంతో వెబ్‌సైట్లో ప్రవేశించాలి. ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు స్వీయ ధ్రువీకరణతో వ్యక్తిగత, చిరునామా నిర్ధారణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత ఇందులోని వివరాలను నవీకరణ కార్యాలయం తనిఖీ చేసి, మార్చాల్సిన సమాచారంతో పోల్చిచూస్తోంది. ఈ ప్రక్రియ కోసం దరఖాస్తుదారు తన మొబైల్‌ నంబర్‌ను ముందుగానే నమోదు చేసి ఉండాలి. లేదంటే పైన సూచించిన వెబ్‌ చిరునామాలోనే ఉండే ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తిచేసి పోస్టులో పంపాలి. ఈ సేవను పొందాలంటే మొబైల్‌ నంబర్‌ తప్పక రిజిస్టరై ఉండాలి. 

మరిన్ని వార్తలు