విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం 

6 Aug, 2023 06:02 IST|Sakshi

రాష్ట్రంలో పోడు రైతులపై కేసుల మాఫీకి చర్యలు

రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌

నాడు వైఎస్, నేడు కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇచ్చారు: గోరటి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 330 ఎకరాల భూమిని చూపినా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరారు.

శనివారం శాసనమండలిలో ‘గిరిజన సంక్షేమం–పోడు భూములకు పట్టాల పంపిణీ’పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిచ్చారు. పోడు భూముల వివాదాల్లో తలెత్తిన కేసులను సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎత్తివేసేందుకు అటవీశాఖ, డీజీపీలతో కూడిన కమిటీ కసరత్తు ప్రారంభించిందని చెప్పారు. 2023–24 లో 15 వేల మంది గిరిజన రైతుల ప్రయోజనాల కోసం ‘గిరివికాసం’కింద రూ.150 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు.

రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్‌ నిర్మాణ పనులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని, 500 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా అన్ని సౌకర్యాలతో హాస్టల్‌ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ల హయాంలోనే పోడుభూములకు పట్టాలు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు.

మరిన్ని వార్తలు