విపత్తు నిర్వహణ శాఖ నిర్లక్ష్యంపై ఫిర్యాదు

30 Oct, 2022 01:32 IST|Sakshi
సాయికృష్ణ ఆజాద్‌  

‘సాక్షి’కథనం ఆధారంగా హెచ్చార్సీలో ఫిర్యాదు 

పిడుగుపాటుతో రోడ్డునపడ్డ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి 

నివారణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్‌ పిటిషన్‌ దాఖలు

నాంపల్లి: రాష్ట్రంలో పిడుగుపాటుతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకుని, వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్‌ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. పిడుగుపాటు నివారణ చర్యలు చేపట్టడంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దేశంలో పిడుగుపాటు ప్రమాదాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, గడచిన ఆరేళ్లలో ఇక్కడ 398 మంది మృత్యువాతపడ్డారని, ఇందుకు సంబంధించి ‘సాక్షి’లో పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని వివరించారు. ప్రమాదాలకు గురైనవారిలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించే రైతులు, రైతుకూలీలు ఉన్నట్లు తెలియజేశారు. పిడుగుపాటుకు బలైన నిరుపేద కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రోడ్డునపడ్డ కుటుంబాలను ఆదుకోవడం, పిడుగుపాటు నివారణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, పుణే ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ఇది 20 కిలో మీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే హెచ్చరికలను జారీ చేస్తుందని తెలిపారు.

అధునాతన పరికరాల సహాయంతో అనేక రాష్ట్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పిడుగుపాటు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని, పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. 

మరిన్ని వార్తలు